బీజేపీకి అభ్యర్ధులు దొరకడంలేదన్న బాధ ఓ వైపు ఉంటే కేంద్రంలోని మోడీ, అమిత్ షా తాజాగా తీసుకుంటున్న కొన్ని చర్యల మూలంగా ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఇపుడు పోటీకి రెడీ అంటున్నారు. వచ్చే ఎన్నికల తరువాత మరో మారు కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్ని రకాల సర్వేలు చెబుతూండడంతో పార్టీలో కొంత మంది పోటీకి నో అంటున్నా మేమున్నామని మరి కొందరు ముందుకు రావడం విశేషం. దాంతో కమలం పార్టీలో విశాఖ వరకూ కొంత వరకూ అభ్యర్ధుల బెంగ తీరినట్లేననుకోవాలి.విశాఖ బీజేపీలో చాన్నాళ్ళుగా పని చేస్తూ వస్తున్న సాగి కాశీ విశ్వనాధరాజు వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సినిమా నటుడు కృష్ష్ణంరాజుకు దగ్గర చుట్టం కావడం విశేషం. దాంతో మాజీ కేంద్ర మంత్రి హోదాలో కృష్ణంరాజు తన చుట్టానికి విశాఖ టికెట్ కోసం డిల్లీ లెవెల్లో లాబీయింగ్ చేస్తున్నారు. విశాఖ బీజేపీలో రాజు గారికి కొంత పట్టు ఉంది. గతంలో కూడా ఆయన విశాఖ దక్షిణం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అనుభవం ఉంది. ఆర్ధికంగా కూడా బలవంతుడు కావడం, నగరంలోని వివిధ వర్గాలతో పరిచయాలు ఉండడంతో ఆయనకు టికెట్ ఇస్తారని భావిస్తున్నారు.ఇక విశాఖ నగర పరిధిలో అగ్ర వర్ణాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బ్రాహ్మణులు, రాజులు, క్షత్రియులు బీజేపీని అభిమానించే ఓటేసే వారే. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో వారంతా ఇపుడు కొంత విముఖంగా ఉన్నా ఈబీసీలకు పది శాతం మోడీ రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తేవడంతో ఆ వర్గాలు తిరిగి బీజేపీ వైపు చూస్తాయని ఆశిస్తున్నారు. అదే విధంగా జీఎస్టీ లో కూడా చిన్న వ్యాపారులకు ఊరటని ఇచ్చే విధంగా శ్లాబులు మార్పు చేయడంతో వారు కూడా మళ్ళీ కమలం పార్టీ వైపు మళ్ళుతారని అంటున్నారు. ఇక విశాఖలో ఉత్తరాది వారి జనాభా కూడా అధికంగానే ఉంది. ఈ వర్గాలు కూడా మోడీకే జై అనే పరిస్థితులు ఉంటాయని ఆ పార్టీ విశ్వాసంతో ఉంది. విశాఖ బీజేపీకి ప్రతిష్టాత్మకమైనది. సిట్టింగ్ ఎంపీ బీజేపీకి చెందిన వారు కావడంతో ఈ సీటుని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకుంటోంది. దాంతో మరిన్ని వరాలు విశాఖకు ప్రకటించడమే కాకుండా రైల్వే జోన్ కూడా ఇస్తారని అంటున్నారు. ఇక మోడీ, అమిత్ షా ప్రచారం కూడా విశాఖలో పెద్ద ఎత్తున చేయదం ద్వారా రానున్న ఎన్నికల్లో గెలుపు అవకాశాలను పెంచుతారని భావిస్తున్నారు. ఆర్ధికంగా కూడా పార్టీ సాయంతో పాటు, కేంద్రమో సర్కార్ ఉండడం ఒక అడ్వాంటేజ్. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పోటీకి రాజు గారు రెడీ అంటున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ హరిబాబు మళ్ళీ పోటీ చేయనంటేనే వేరే వారికి చాన్స్ దక్కేది.