YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ కు ప్రాంతీయ పార్టీలు ఝలక్

కాంగ్రెస్ కు ప్రాంతీయ పార్టీలు ఝలక్

ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఝలక్ ఇవ్వడంతో అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూటమి దిశగా ముందుగానే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ కూటమి నుంచి ఏ ఒక్క పార్టీ చేజారిపోకూడదన్న భావనలో ప్రాంతీయ పార్టీల నేతలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ చొరవ చూపక పోవడం వల్లనే మాయావతి, అఖిలేష్ యాదవ్ వేరు కుంపటి పెట్టుకున్నారన్న వాదనలో నిజముంది. కొన్నాళ్లుగా వారిద్దరూ కలసి పోటీ చేస్తారని, కాంగ్రెస్ ను దూరంగా పెడతారని తెలిసినా హస్తం పార్టీ అధినాయకత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. మిగిలిన రాష్ట్రాల్లో ముందుగానే కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో డీఎంకే ఈ మేరకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. డీఎంకే అధినేత స్టాలిన్ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలను వేగం చేశఆరు. ఇక్కడ కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ లు ఉండటం దాదాపు ఖరారయింది. దీంతో పాటు ఎండీఎంకే, వీసీకే. మనిదనేయ మక్కల్ కట్చి వంటి చిన్న పార్టీలకూ కూటమిలో స్థానం కల్పించాలని స్టాలిన్ యోచిస్తున్నారు. ఈ దిశగా వారితో చర్చలు ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీలకు గాలం వేయకముందే స్టాలిన్ సీట్ల పంపకం, కూటమి ఏర్పాటుపై చర్యలు ప్రారంభించడం విశేషం. మహారాష్టలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికల్లో ఒప్పందం కుదిరింది. మహారాష్ట్రలోనూ బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో శరద్ పవార్ ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ స్థానాలుండగా 45 స్థానాల్లో సీట్ల పంపకంపై ఒప్పందం కుదిరింది. మహారాష్ట్రలోని కూటమిలో వామపక్షాలకు చోటు కల్పించాలని రాహుల్ గాంధీ ఇప్పటికే నిర్ణయించారు. వీరితో పాటు రాజ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేనను కూడా కలుపుకుని వెళ్లాలని చూస్తోంది. శరద్ పవార్ ఇప్పటికే రాజ్ థాక్రేతో చర్చలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కూటమి బలం మరింత పెరుగుతుందన్న విశ్వాసంతో హస్తం పార్టీ ఉంది. బీహార్ లోనూ మహా గడ్వంధన్ కు రాష్ట్రీయ జనతాదళ్ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ప్రయత్నాలు ప్రారంభించారు. బీహార్ లో ఇప్పటికే బీజేపీ, జేడీయూ, రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. ప్రస్తుతం కాంగ్రెస్, ఆర్జేడీ మాత్రమే బీహార్ లో కూటమిగా ఉన్నాయి. వీటితో పాటు సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలను కూడా బీహార్ లో కలుపుకుని వెళ్లాలని తేజస్వి యాదవ్ నిర్ణయించారు. ఈ మేరకు అఖిలేష్, మాయావతితో చర్చలు జరిపారు. ఇంకా ఫైనల్ కాకపోయినప్పటికీ ఈ రెండు పార్టీలూ బీహార్ లో మాత్రం కూటమిలో చేరే అవకాశాలున్నాయి. మొత్తం మీద కూటమి ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల అధినేతలు బిజీగా ఉన్నారు

Related Posts