కర్ణాటకలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ముంబై హోటల్ లో ఉన్నారని, బీజేపీ నేతలు వారిని ప్రలోభపెట్టి వారి వైపు తిప్పుకుంటున్నారని మంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. బీజేపీ ఆపరేషన్ కమల్ ప్రారంభించిందని, తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే, ఆపరేషన్ కమల్ ఆరోపణలను బీజేపీ నేత యడ్యూరప్ప ఖండించారు. కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు మంతనాలు జరుపుతున్నాయని ఆయన ఆరోపించారు.అయితే, ముందుజాగ్రత్తగా బీజేపీ వారి ఎమ్మెల్యేలను గురుగావ్, హర్యానాలోని రిసార్ట్స్ కు తరలిస్తున్నారు. అయితే, ముంబైలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. త్వరలోనే వారి వచ్చేస్తారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచినా మ్యాజిక్ ఫిగర్ కి చేరకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అధికారాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ తరచూ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని రెండువర్గాలూ ఆరోపణలు చేస్తున్నారు.