YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో కాంగ్రెస్ కు కలిసి రాని కాలం

ఏపీలో కాంగ్రెస్ కు కలిసి రాని కాలం

ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. రాష్ట్ర విభ‌జ‌న‌తో 2014 ఎన్నిక‌ల్లో ఉనికిని కోల్పోయిన ఈ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ఏపీలో ఎక్కడా పుంజుకున్నది లేదు. అయితే, ఇటీవ‌ల పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన రెండు మూడు మెరుపులు రాష్ట్ర నేత‌ల్లో ఉత్సాహం నింపుతున్నా.. తాజాగా మారిన రాజ‌కీయ వ్యూహంతో అవి కాస్తా ఆవిర‌వుతున్నాయ‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంలోని న‌రేంద్ర మోడీని గ‌ద్దె దింపి త‌మ‌కు పీఠం అప్పగిస్తే.. ఏపీకి హోదా ఇస్తామ‌ని ప్రక‌టించారు. ఇక‌, విభ‌జ‌న హామీల‌ను కూడా ఇస్తామ‌న్నారు. ఇదిలావుంటే.. టీడీపీ అదినేత సీఎం చంద్రబాబు కూడా కాంగ్రెస్‌తో చేతులు క‌లిపారు. టీడీపీ అండ‌తోనైనా ఏపీలో ఎద‌గాల‌ని నిర్ణయించుకున్న కాంగ్రెస్ నాయ‌కులు ద‌శాబ్దాల వైరాన్ని ప‌క్కన పెట్టి జై కొట్టారు తెలంగాణాలో పోటీ చేశారు. అయితే అక్కడ చేసిన ఈ ప్రయోగం విక‌టించింద‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపించాయి. కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నది. దీంతో బాబుతో క‌లిసి వెళ్లాలా వ‌ద్దా? అనే సందేహంలోనే నాయ‌కులు మిగిలి పోయారు. ఇదిలావుంటే, కేంద్రంలో చ‌క్రం తిప్పడం కోస‌మే తాను కాంగ్రెస్‌కు మ‌ద్దతిచ్చి రాహుల్‌కు జై కొట్టాను కానీ ఏపీలో ఆ పార్టీకి పావును కాద‌లుచుకోలేద‌ని చంద్రబాబు కుండ బ‌ద్దలు కొట్టారు. దీంతో ఇప్పడు కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తాన‌ని చెప్పినా.. ప్రయోజ‌నం ఎక్కడా క‌నిపించ‌డం లేదు.క్షేత్రస్థాయిలో త‌న వాగ్దానాన్ని ప్రచారం చేసుకునే ప‌రిస్థితిలో ఎక్కడా కాంగ్రెస్ వ్యూహ‌మే క‌నిపించ‌డం లేదు. పైగా పార్టీలోని సీనియ‌ర్ల ప‌రిస్థితే.. ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పార్టీని వీడుతారో అన్నట్టుగా మారింది. కేంద్రంలోనూ రాహుల్ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా ఎక్కడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఏపీలో కాంగ్రెస్‌కు ఆశించిన ఫ‌లితం ల‌భించేలా లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి ప్రధాని మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశారని ప్రజలు ఇప్పుడు కోపంతో ఉన్నారు. అయిన‌ప్పటికీ .. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ హోదా ఇస్తామ‌ని చెబుతున్నా.. ప్రజ‌లు ఎందుక‌నో నమ్మే ప‌రిస్తితిలో లేర‌నేది వాస్తవంగా క‌నిపిస్తున్న విష‌యం. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా కావాలా? వద్దా? అనే విషయం ఆధారంగానే పోటీ ఉంటుంద‌ని రాష్ట్ర నాయ‌కులు చెబుతున్నా.. మారిన రాజ‌కీయ ప‌రిస్థితిలో సెంటిమెంటు కూడా వ‌ర్కవుట్ అయ్యే ప‌రిస్తితి క‌నిపించ‌డం లేద‌ని కాంగ్రెస్‌ను బాగా అర్ధం చేసుకున్న నాయ‌కులు చెబుతున్నారు

Related Posts