రాష్ట్ర శాసనసభ, లోక్‌సభకు మే నెలలో జరగనున్న సాధారణ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన దృష్టి సారించి ఆ మేరకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా టీడీపీ సహజంగా ఎన్నికల సమయం వరకూ జాబితా విడుదల చేసిన సందర్భం లేదు. అయితే ఈసారి అందుకు భిన్నంగా తొలి జాబితాను జనవరిలో విడుదల చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దాంతో ఆశావహులు తొలి జాబితాలో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నెలలో జాతీయ రాజకీయాలు, శాసనసభ సమావేశాలు, ధర్మపోరాట దీక్ష చివరి సభ వంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున తొలి జాబితాను ఫిబ్రవరిలో విడుదల చేస్తారని ఆ పార్టీ కీలక నేతలు భావిస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాతే తొలి జాబితా వస్తుందని చివరి వారంలో రెండవ జాబితా, మార్చి రెండవ వారంలో మూడవ జాబితా ఎన్నికల నామినేషన్ల సమయంలో చివరి జాబితా విడుదల చేస్తారని వారంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఫిబ్రవరిలోనే ప్రకటించవచ్చని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. జగన్ త్వరలో బస్సు యాత్ర ప్రారంభించనున్నారని ఈలోగా తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేస్తారని వారు భావిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో బస్సు యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వారన్నారు. ఆ తరువాత యాత్రలో భాగంగా పార్టీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ కీలక నేతలతో చర్చించి తదుపరి జాబితాలు ఒకొక్కటిగా విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇక జనసేన పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా జాబితాను ఫిబ్రవరిలోనే ప్రకటించవచ్చని ఆ పార్టీ అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నెల చివరికి రాష్ట్రంలో సుమారు 125 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని వారికి సమాచారం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వీరి పేర్లను ఫిబ్రవరి తొలి వారంలో విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు మెగా అభిమానులు, జనసేనపార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారు వెల్లడిస్తున్నారు.