YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆక్రమణలకు కేరాఫ్ అడ్రస్ గా రిజర్వ్ స్థలాలు

ఆక్రమణలకు కేరాఫ్ అడ్రస్ గా రిజర్వ్ స్థలాలు

హిందూపురం పట్టణంలో మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వు స్థలాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికే అనేక రిజర్వు స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. మున్సిపల్ స్థలాల్లో పోటాపోటీగా ప్రార్థనాలయాలు నిర్మించడం ఇక్కడ రివాజుగా మారింది. మరోవైపు తమ రిజర్వు స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోని దుస్థితిలో మున్సిపాలిటీ ఉంది. కొట్నూరు వద్ద దాదాపు మూడు ఎకరాల స్థలం ఉన్నా మున్సిపల్ స్థలమని అధికారులు తెలుసుకోలేకపోయారు. చివరకు రెవెన్యూ అధికారులు అది మున్సిపల్ స్థలమని గుర్తించి తాగునీటి పథకం ఫిల్టర్ బెడ్‌ల నిర్మాణానికి కేటాయించారు. మరోవైపు పట్టణంలో బెంగళూరు రోడ్డులో ఉన్న రిజర్వు స్థలం ఆక్రమణలకు గురవుతోందని, చర్యలు తీసుకోవాలని తరచూ ప్రజా ప్రతినిధులు కౌన్సిల్‌లో మొరపెట్టుకొంటుంటారు. పట్టణంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఎదురుగా మున్సిపల్ స్థల వివాదం కోర్టులో ఉండగానే నిర్మాణ పనులు జరిగిపోయాయి. నిర్మాణాలను అడ్డుకొనేందుకు అధికారులు విఫలయత్నం చేశారు. మరోవైపు పట్టణంలో మున్సిపల్ ట్యాంక్‌లను కూల్చి వేసి స్థలాలను ఆక్రమించుకొంటున్నారు. ఇకపోతే నల్లప్ప లేఔట్‌లో మున్సిపాలిటీకి స్థలం ఉంటే ఈ స్థలం ఆక్రమణలకు గురవుతుండటంతో ఐదారేళ్ల క్రితం అప్పటి అధికారులు చర్యలు తీసుకొని చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇలాగే వదిలేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఈ స్థలాన్ని ఉద్యానవనంగా ప్రకటించి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఈ స్థలంలోకి వెళ్ళడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి రోడ్లు నిర్మించారు. అయితే ఈ స్థలాన్ని పట్టించుకోకపోవడం లేదు. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడంతో ఉద్యానవన స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీనికితోడు ఇక్కడ జనావాసాలు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే ఉద్యానవనంగా పేర్కొన్న స్థలంలో అభివృద్ధి పనులు చేపట్టాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ రోషన్‌అలీ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జనావాసాల నడుమ ఉన్న ఈ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేస్తే ప్రజలకు ఎంతో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ అధికారులు రిజర్వు స్థలాలపై దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆక్రమణలు చోటు చేసుకొంటున్నా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. దీనికితోడు మున్సిపల్ రిజర్వు స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే అంశంపై ఇప్పటికీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన లోపించడం, రికార్డులు లేకపోవడం ఈ విభాగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటికైనా పట్టణంలోని విలువైన మున్సిపల్ రిజర్వు స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Posts