YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నేతలకు బీపీ తెస్తున్న ముందుస్తు జాబితా..!!

నేతలకు బీపీ తెస్తున్న ముందుస్తు జాబితా..!!

రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల మొదటి విడత జాబితా సంక్రాంతి నాటికి ప్రకటిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఆశావాహుల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణలో కెసిఆర్‌ 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎపిలోనూ అదే ఫార్ములాను అనుసరించి నోటిఫికేషన్‌ రాకముందే సంక్రాంతి తర్వాత టిడిపి అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చేసిన ప్రకటన తెలిసిందే. 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీకి దక్కింది 3 స్థానాలే. ఆ తరువాత వైసిపి నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల చేరికతో టిడిపి బలం 8కు చేరుకుంది. వైసిపి బలం 11 నుంచి 6కు పడిపోయింది. 2014లో కర్నూలు జిల్లాలో చేదు ఫలితాలను చవిచూసినా తెలుగుదేశం 2019లోనైనా మెరుగైన ఫలితాలు సాధించాలని ఇప్పటికే పోటీచేసే అభ్యర్థులపై సర్వేల మీద సర్వేలు చేయించింది. ఈ సర్వేల ఆధారంగానే ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన ముందస్తుగానే ప్రకటిస్తారని అనుకున్నా ఈ విషయం అంత కలిసి వచ్చేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ సమాంతరంగా బలమైన అభ్యర్థులున్నారు. ఇప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తే 3 నెలల పాటు ఎన్నికలు ఉండడంతో టికెట్‌ దక్కని వారు వైసిపిలోకి వెళ్లడమో లేదా లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉందని అధిష్టానం సంక్రాంతికి అభ్యర్థులను ప్రకటించడానికి సంకోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలు కూడా అభ్యర్థుల్లో టెన్షన్‌ పుట్టిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా కాంగ్రెస్‌కు ఇక్కడ పటిష్టమైన న్యాయకత్వం ఉంది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అనుచరవర్గం కర్నూలు పార్లమెంటుతోపాటు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలోని డోన్‌, పాణ్యంలో గణనీయంగా ఉంది. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాణ్యం నియోజకవర్గం టికెట్‌ను ఆశిస్తుండగా, కోట్ల కుటుంబం డోన్‌, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలపై కన్నేసింది. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనుకున్న టిడిపికి జిల్లాలో అభ్యర్థుల ప్రకటన సవాల్‌గానే మారనుంది. పత్తికొండ, డోన్‌ నియోజకవర్గాలు ఉపముఖ్యమంత్రి కెఇ క్రిష్ణమూర్తి ఆధిపత్యంలో ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతానని, తన కుమారుడు కెఇ శ్యాంబాబుకు అవకాశం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి కెఇ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంచారు. ఈ మేరకు కెఇ శ్యాంబాబు పత్తికొండ నియోజకవర్గ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భూమా అఖిలప్రియకు నియోజకవర్గంలోనే పార్టీలో ఇబ్బందులు ఉన్నాయి. నంద్యాల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యేకు అసమ్మతి లేకున్నా భూమా బ్రహ్మానందారెడ్డితో పాటు ఎస్వీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి, మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ కుమారుడు కూడా టికెట్‌ను ఆశిస్తున్న పరిస్థితి ఉంది. పాణ్యం నుంచి కూడా టికెట్లను ఆశిస్తున్న వారి సంఖ్య తెలుగుదేశంలో భారీగానే ఉంది. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ అసంతృప్తులు , ప్రత్యామ్నాయం బలంగా ఉండడంతో తెలుగుదేశం అధిష్టానం మొదటి విడత జాబితాలో ఏవరి పేరు ప్రకటిస్తుందనేది చర్చనీయాంశమైంది. 

Related Posts