ఎపిఎస్ ఆర్టీసికి చట్ట ప్రకారం ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము ఇవ్వకపోవడం వల్లనే ఆ సంస్థ నష్టాల్లో కొనసాగుతోంది. దీంతో ఆదాయం పెరిగినా ఆర్టీసి నష్టాలు మాత్రం తగ్గడం లేదు. ఈ నష్టాల సాకుతో ఆర్టీసి ఉద్యోగుల వేతన సవరణకు యాజమాన్యం మోకాలడ్డుతోంది. 2014 నాటికి ఆర్టీసికి ఏడాదికి రూ.3,500 కోట్ల ఆదాయం వచ్చేదల్లా 2018కి సుమారు రూ.5,500 కోట్లకు పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో(ఒఆర్) కూడా 66 శాతం నుంచి 76.71 శాతానికి పెరిగింది. సంస్థలోని కండక్లర్లు, డ్రైవర్లతో పాటు సిబ్బంది మొత్తం కష్టపడటంతో ఎర్నింగ్ పర్ కిలోమీటర్(ఇపికె) గతేడాది కన్నా 6.16 శాతం, ఎర్నింగ్ పర్ బస్(ఇపిబి) రూ.10,751 పెరిగింది. ఇన్ని విధాలుగా ఆర్టీసి అభివృద్ధి చెందినా అప్పులు, వడ్డీలతో కలిపి సుమారు రూ.6,250 కోట్ల నష్టాల్లో వుంది.
ఆర్టీసి చట్టం (1950) ప్రకారం 1:2 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసికి కేపిటల్ కంట్రిబ్యూషన్ చెల్లించాల్సి ఉంది. దాన్ని కూడా ఆర్టీసికి చెల్లించడం లేదు. కేరళ ప్రభుత్వం ఆర్టీసికి వచ్చే నష్టం మొత్తాన్ని ఏ ఏడాదికి ఆ ఏడాది బడ్జెట్ నుంచి చెల్లిస్తోంది. ఎపిలో మాత్రం చిన్న చిన్న రాయితీల మాత్రం తిరిగి చెల్లిస్తూ రూ.290 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తోంది. ఇవ్వాల్సింది ఇవ్వకపోగా పన్నుల రాయితీలు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఆర్టీసికి వచ్చే ఆదాయంలో దాదాపు రూ.2,100 కోట్లు పన్నులకే చెల్లించాల్సి వస్తోంది. విమాన ఇంధనంపై ఒక శాతం పన్ను ఉండగా ఆర్టీసికి డీజిల్‌పై 26.24 శాతం పన్ను విధిస్తున్నారు. ఆర్టీసిలో పది లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులు 3500, 15లక్షల కిలోమీటర్లు దాటిన బస్సులు 1500 ఉన్నాయి. వాటి స్థానాల్లో కొత్త బస్సులను తీసుకొ చ్చేందుకు కనీసం రూ.2వేల కోట్లు కావాలి. ప్రభుత్వం బస్సుల కొనుగోలుకు సాయమందించకపోవడంతో అద్దె బస్సుల కోసం ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పెంచాల్సిన మరో వెయ్యి బస్సులను పెంచాలంటే రూ.700 కోట్లు అదనంగా కావాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బస్సుల కొనుగోలు పేరుతో కేవలం రూ.200 మాత్రమే ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించింది. డీజిల్ ధరలు పెరగడంతో ఏడాదికి రూ.900 కోట్లు ఆర్టీసిపై భారం పడుతోంది. వీటిని ప్రభుత్వమే భరిస్తే ఆర్టీసికి నష్టాలే ఉండవని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసిని ఆదుకో వాలని కోరుతూ ఎమ్‌డి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపా దనలు పంపారు. నష్టాల సాకుతో వేతన సవరణను జాప్యం చేయడం తగదని, ఈ నెల 18న జరిగే వేతన సవరణ కమిటీ భేటీ తరువాత యాజమాన్యం తీరును బట్టి సమ్మె కార్యాచరణ ప్రకటిస్తామని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.