తాను ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదని, ఒంటరిగానే పోటీ చేస్తానని, తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇస్తున్నారు. అయితే, ఆయన ఎంతగా చెబుతున్నా ఆయన మాటలే అనుమానాలకు తావిస్తున్నాయి. ఆయన టీడీపీని కాకుండా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం వెనుక టీడీపీ – పవన్ కళ్యాణ్ కుట్ర ఉందనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ. అయితే, ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాన్ని కూడా టార్గెట్ చేయాల్సిందే. కానీ, ప్రధానంగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంతో వైసీపీ నేతలు.. చూశారా పవన్ కళ్యాణ్ తో టీడీపీకి ఇంకా లింక్ ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా వైసీపీ నేతల ఆరోపణలకు తావిస్తున్నాయి. శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… తాను, పవన్ కలిస్తే జగన్ కి నొప్పేంటి అని వ్యాఖ్యానించడంతో ఈ కుమ్మక్కు రాజకీయాల చర్చ ప్రారంభమైంది. టీడీపీ మళ్లీ పవన్ తో కలుస్తుంది అని వైసీపీ పెద్దఎత్తున ఆరోపణలు చేసింది. దీంతో పవన్ కళ్యాణ్.. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, మొత్తం 175 స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. వామపక్షాలతో మాత్రం పొత్తు ఉంటుందంటున్నారు. అయితే, వామపక్షాలు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న మహాకూటమిలో భాగమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ కూటమికి సమన్వయకర్తగా ఢిల్లీ వెళ్లినప్పుడల్లా సీపీఐ, సీపీఎం అగ్రనేతలను కలిసి వస్తున్నారు. జాతీయ స్థాయిలో టీడీపీతో కూటమిలో ఉండే ఈ పార్టీలు ఏపీలో మాత్రం జనసేనతో కలుస్తుండటాన్ని వైసీపీ నేతలు లేవనెత్తుతున్నారు.ఇటీవల పార్టీ నేతలతో సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… తనతో పొత్తు కోసం వైసీపీ నేతలు కొందరు టీఆర్ఎస్ నేతలతో రాయబారం నడుపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఆ టీఆర్ఎస్ నేతలు ఎవరనేది ఆయన బయటపెట్టలేదు. ఇక తాజాగా గుంటూరు జిల్లాలో సంక్రాంతి సంబరాల్లో కూడా పవన్ మాట్లాడుతూ… చంద్రబాబుపై కక్ష సాధించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ కలుస్తుందని ఆరోపించారు. వాస్తవానికి, టీఆర్ఎస్ తో వైసీపీ కుమ్మక్కయిందనేది తెలుగుదేశం పార్టీ వాదన. మరి, ఈ వాదనను పవన్ కళ్యాణ్ ఎందుకు రెండుసార్లు తెరపైకి తీసుకువచ్చారనేది అర్థం కాని ప్రశ్న. పవన్ కళ్యాణ్ చేసే ఈ ఆరోపణల ద్వారా ఆయనకు, ఆయన పార్టీకి కలిగే మేలు ఏమీ లేకపోగా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో వైసీపీ మరోసారి ‘టీడీపీ – పవన్ ఒక్కటే’ అనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే పవన్ తో ప్రత్యేకంగా పోటీ చేయిస్తున్నారు కానీ ఆయనతో టీడీపీకి ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయనేది వైసీపీ వాదన.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదగాలని పవన్ భావిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నచ్చని వర్గాలు సైతం పవన్ వైపు చూస్తున్నాయి. ఇటువంటి సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా ఇటువంటి ప్రచారానికి ఎందుకు తావిస్తున్నారనేది అర్థం కావడం లేదు. తాను కూడా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుపై వైసీపీ – టీఆర్ఎస్ కక్ష సాధించాలని అనుకుంటే, పవన్ కి వచ్చిన నష్టమేంటి.? ఎన్నికల ముంగిట ఇలా చంద్రబాబుపై సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు మాట్లాడటం ద్వారా పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా నష్టం జరుగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.