YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఊసరవెల్లిని తలపిస్తున్న ఏపీ పాలిటిక్స్

ఊసరవెల్లిని తలపిస్తున్న ఏపీ పాలిటిక్స్

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు తారా స్థాయికి చేరుతున్నాయి. మీరు వారితో కుమ్మక్కయ్యారంటే… మీరు వీరితో కుమ్మక్కయ్యారంటూ కొత్త తరహా రాజకీయాలను అవలంబిస్తున్నారు. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా పార్టీల వ్యవహారం తయారైంది. ఇక, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీతో ఈ తరహా ఆరోపణలు ఎక్కువయ్యాయి. భేటీ ప్రారంభానికి ముందు నుంచే టీడీపీ వైసీపీని కౌంటర్ చేయడం ప్రారంభించింది. ఇక, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ కూడా జగన్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఆంధ్రా ద్రోహి అని, ఆయన కాళ్ల వద్ద జగన్ పడి ఆంధ్రుల మనోభావాలను జగన్ దెబ్బ తీస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఆంధ్రా ద్రోహుల్లారా ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో వేలుపెట్టిన చంద్రబాబును ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలను అమలు చేసిందో అదే వ్యూహాలను టీడీపీ ఏపీలో అవలంబిస్తోంది. అయితే, ఇక్కడ కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణల్లో పస ఉండటం లేదు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎంపీ కవిత కేసు వేశారని, కేసీఆర్ గతంలో ఆంధ్రులని అవమానించారని పలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే, చంద్రబాబు చేసిన ఓ తప్పిదంతో ఈ ఆరోపణల్లో తేలిపోతున్నాయి. ఐదు నెలల క్రితం హరికృష్ణ మరణించిన సమయంలో టీఆర్ఎస్, టీడీపీ కలిసి పనిచేయాలని చంద్రబాబు స్వయంగా కేటీఆర్ ను కోరారు. కేటీఆర్ అందుకు అంగీకరించ లేదు. దీంతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసిపోయారు. అయితే, కేసీఆర్ ఆంధ్రులను అవమానించింది, కవిత పోలవరంపై కేసు వేసింది అంతకుముందే. మరి, ఇవన్నీ తెలిసి టీఆర్ఎస్ తో భేటీకి చంద్రబాబు ఎందుకు ప్రయత్నించారనే ప్రశ్నను వైసీపీ నేతలు లేవనెత్తుతున్నారు. ఇక, కేసీఆర్ ఆంధ్రులని అవమానించే మాట్లాడి ఉండవచ్చు. కానీ, అవి ఉద్యమ సమయంలో మాట్లాడిన మాటలు. తెలంగాణ సాధించి ఆయన 2014లో ముఖ్యమంత్రి అయ్యాక అప్పటివరకు ఉన్న భయాలేవీ లేకుండా తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. అందుకే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు.ఇక, కేసీఆర్ కాళ్ల మీద జగన్ పడి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారనేది టీడీపీ చేస్తున్న మరో విమర్శ. అయితే, జగన్ ఇంటికి కేటీఆర్ వచ్చారు కానీ.. జగన్ వారి వద్దకేమీ వెళ్లలేదు. పైగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా జగన్ తో చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు. ఇక్కడ ఆంధ్రుల ఆత్మగౌరవం పెరుగుతుంది కానీ తగ్గేదేం ఉందనేది వైసీపీ సర్కిల్స్ వాదన. పోలవరం మీద కవిత కేసు వేసింది వాస్తవమే కావచ్చు. అదే సమయంలో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుపై చంద్రబాబు కూడా అభ్యంతరాలు తిలిపిన మాట కూడా వాస్తవమే అయి ఉండొచ్చు. ఏదైనా కోర్టుల ద్వారా లేదా ఉద్రిక్తతలతో సమస్యలు పరిష్కారం కావు. సామరస్యంగానే పరిష్కరించుకోవాలి. ఈ లెక్కన మరో ఐదేళ్ల పాటు తెలంగాణకు కేసీఆరే ముఖ్యమంత్రి. ఆయనతో చంద్రబాబుకు పొసగటం లేదు. ఈ సమయంలో జగన్ కేసీఆర్ తో సఖ్యతగా ఉంటే రేపు ఆయన అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి అంతోఇంతో మేలు చేసేదే కానీ కీడు చేసేదేం ఉండదు. ఏపీ ప్రజలు ఈ విషయం ఆలోచిస్తే చంద్రబాబుకే ఇబ్బంది తప్పదు. ఇక, ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ అనుకూలం అని కేటీఆర్ తో జగన్ మరోసారి చెప్పించారు.ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం నరేంద్ర మోదీకి కేంద్రంలో కొన్ని సీట్లు తగ్గినా ఆయనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే ప్రత్యేక హోదా కోసం మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పోరాడక తప్పదు. ఇదే పరిస్థితి గనుక వస్తే టీఆర్ఎస్ మద్దతు ఏపీ ఎంపీలకు ఉంటే అదే కచ్చితంగా అదనపు బలమే అవుతుంది. మొత్తానికి, కేసీఆర్, జగన్ కలిసి ఆంధ్రాకు ద్రోహం చేస్తున్నారంటే ప్రజలు పెద్దగా నమ్మే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ తో పొత్తుకు ప్రయత్నం చేసిన విషయాన్ని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారు. అది కుదరక రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో కలిశారని ప్రజల్లోకి వెళ్లింది. ఇక, బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్, జగన్ తో పాటు అసదుద్దిన్ కూడా పనిచేస్తున్నారంటున్నారు.మొన్నటివరకు పవన్ కళ్యాణ్ పేరు కూడా చెప్పినా ఇప్పుడు ఆయనను మినహాయించారు. అయితే, దశాబ్దాలుగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అసదుద్దిన్ ఓవైసీ బీజేపీతో కలిశారంటే ఎవరు నమ్ముతారో చూడాలి. కేసీఆర్ కూడా బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు కానీ మోదీతో వ్యక్తిగత వైరం పెట్టుకోలేదు. అందుకే అభివృద్ధి కార్యక్రమాల కోసం నేరుగా ప్రధానిని కలవగలుగుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన వ్యూహం సరైనదే. అంతమాత్రానికే బీజేపీతో కుమ్మక్కు కావడం సరికాదంటున్నారు విశ్లేషకులు. ఇక, ఎన్నిలకు ముందు జగన్ సెల్ప్ గోల్ వేసుకున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అదే నిజమైతే టీడీపీకి అంతకంటే అదృష్టం ఇంకేముంది. టీడీపీ చంకలు గుద్దుకోవాలి కానీ ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకొచ్చి ఎందుకు తీవ్రస్థాయిలో మాట్లాడుతున్నారనేది వైసీపీ నాయకుల ప్రశ్న. మొత్తానికి జగన్ ను టార్గెట్ చేసేందుకు తెలుగుదేశం చేసే ప్రయత్నం పెద్దగా కలిసివచ్చే అవకాశం లేదంటున్నారు. ఇక, జగన్ కి మాత్రం కేసీఆర్ నేతృత్వంలోని కూటమిలో కలిస్తే ఏపీలో ఎలాంటి నష్టమూ, అలాగని లాభమూ ఉండే అవకాశం లేదు.

Related Posts