ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన గులాబీ అధినేత కేసీఆర్.. దేశ రాజకీయ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తర భారత దేశ ముఖ్యమంత్రులతో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ముమ్మరంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పయనం కానున్నారట. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుతాన్ని తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆంధ్రపదేశ్ ప్రతిపక్ష నేత జగన్ తో కేటీఆర్ భేటీ కావటం, ఎన్నో విషయాలు చర్చకు రావటం ద్వారా ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. లోటస్ పాండ్ లో జరిగిన ఈ సమావేశంలో జగన్ కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఉన్న అనుమానాలకు తెరదించుతూ జగన్- కేటీఆర్ భేటీ జరిగిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.ఇక కేసీఆర్ కూడా అమరావతి ప్రయాణానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. ఈనెల చివరివారం లేదా వచ్చే నెల మొదటివారంలో అమరావతికి కేసీఆర్ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా వైసీపీ పార్టీని ఫెడరల్ ఫ్రెంట్‌లోకి ఆహ్వానించనున్నారట కేసీఆర్. లోటస్‌పాండ్‌లో జగన్, కేటీఆర్ భేటీలో ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖరాస్తే బాగుంటుందని జగన్ కోరారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు పలుకుతూనే తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడుదామని కేటీఆర్ చెప్పారు. అమరావతిలో భేటీ తర్వాత కేసీఆర్ లేఖపై నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన అన్నారు. ఇక జగన్ తో మరిన్ని చర్చలు జరిపేందుకు స్వయంగా అమరావతికి వచ్చి కలుస్తానని జగన్‌కు కేసీఆర్ చెప్పారని సమాచారం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో సైతం ఇది సంచలనంగా మారింది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ జగన్ తో కేసీఆర్ సమావేశం కానుండటం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి కేసీఆర్- జగన్ చర్చలు ఎంతవరకు సఫలం అవుతాయో!