న్యూఢిల్లీ : మారుమూల ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లూ ఇక హైటెక్ హంగులను సమకూర్చుకోనున్నాయి. దేశంలోని 8500 పోలీస్‌స్టేషన్లలో రూ 700 కోట్లతో వైఫై సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో్ భాగంగా ప్రస్తుతం రైల్వేలు దేశంలో 216 ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు ఉచిత ఇంటర్‌నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి.
ఇంటర్‌నెట్ ఇప్పుడు రోజువారీ పనుల్లో కీలక అవసరం కావడంతో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని విస్తరింపచేస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. తొలుత దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లలో వైఫై ఫెసిలిటీ కల్పించేందుకు నిర్ణయం జరిగిందని...త్వరలోనే దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని 7300 స్టేషన్లలోనూ ఈ సదుపాయం అందుబాటులోకి తేవాలని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రణాళికను ఖరారు చేశారని రైల్వే వర్గాలు తెలిపాయి.
గ్రామీణ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్లలో వైఫైతో కూడిన కియోస్క్‌లు డిజిటల్ బ్యాంకింగ్, ఆధార్ జనరేషన్, బర్త్, డెత్ సర్టిఫికెట్ల వంటి ప్రభుత్వ ధృవపత్రాల జారీ వంటి సేవలు అందిస్తాయని వెల్లడించాయి. ఈ ఏడాది మార్చి నాటికి 600 రైల్వే స్టేషన్లలో వైఫై ఫెసిలిటీ కల్పిస్తారు. ఇక మార్చి 2019 నాటికి దేశవ్యాప్తంగా 8500 స్టేషన్లలో ఈ సదుపాయం విస్తరించాలని రైల్వేలు యోచిస్తున్నాయి.