Highlights
- తమిళనాట ఆసక్తికర రాజకీయం
- రజనీ నివాసంలో ఏకాంతంగా భేటీ
- ఈ నెల 21న కమల్ రాజకీయ పార్టీ ఏర్పాటు
- కమల్ ది ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యం
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విలక్షణ నటుడు కమల్ హాసన్ ఆదివారం పోయెస్ గార్డెన్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. రజనీని కలిసేది లేదని గతంలో ప్రకటించిన కమల్.. రజనీ నివాసానికి నేరుగా వెళ్లి ఆయనతో ఏకాంతంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పొత్తులపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్టు కమల్‌హాసన్ ప్రకటించిన నేపథ్యంలో వీరద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ప్రకటన సభకు రజనీకాంత్ రావాలని ఆహ్వానించేందుకు కమల్ ఆయన ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. రజనీతో భేటీ అనంతరం కమల్ మీడియాతో మాట్లాడుతూ.. తామిద్దరి మధ్య భేటీ సాధారణమైనేదనని, రాజకీయాల నేపథ్యంలో కాదని చెప్పారు.
తమిళనాడులో పర్యటన ప్రారంభించనున్న రజనీతో చెప్పడానికి వచ్చినట్లు పేర్కొన్నారు. కమల్‌ని కలవడంపై రజనీకాంత్ కూడా స్పందించారు. ‘డబ్బు కోసమో పేరు కోసమో కమల్ రాజకీయాల్లోకి రావడం లేదు. కేవలం తమిళనాడు ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోనూ అదే వర్తిస్తుంది. ప్రజలకు మంచి చేయాలన్నదే మా ఉద్దేశం.’ అని తెలిపారు. మధురైలో తన రాజకీయ పార్టీ పేరు ప్రకటిస్తారు. బుధవారం సాయంత్రం రామనాథపురం వద్ద ఉన్న ప్రదేశంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ పేరు ప్రకటించనున్నారు.