తమ నాయకుడు వైఎస్ జగన్ ఏది చేసినా బురద చల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ది పొందాలని టీడీపీ నాయకులు యత్నిస్తున్నారని, చంద్రబాబు, టీడీపీ కారణంగానే ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగిందని ఆరోపించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఇక్కడికి ఆహ్వానించిన విషయాన్ని ప్రస్తావించారు. శంకుస్థాపన ఫలకాలపై కేసీఆర్ పేరుని కూడా చెక్కించారని, ఈరోజున కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు నాడు ఆయన్ని ఎందుకు ప్రశ్నించలేదు? గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులకు వైఎస్ షర్మిళ ఫిర్యాదు చేయడంపై చంద్రబాబు వక్రీకరించి మాట్లాడడం సిగ్గుచేటని, దుష్ర్పచారాన్ని ఖండించాల్సిన సీఎం బెదిరింపులకు పాల్పడడం అభ్యంతరకరమని అన్నారు. మహిళగా, బాధితురాలిగా ధైర్యంగా షర్మిళ ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చంద్రబాబు బెదిరింపులు ఏంటి? ఈ కేసును సుమోటాగా స్వీకరించి దర్యాప్తు చేయాల్సింది పోయి బెదిరింపులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు.