YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అయ్యా...ఎమ్మెల్యే సారు... సమస్యలు పట్టించుకోరూ.

అయ్యా...ఎమ్మెల్యే సారు... సమస్యలు పట్టించుకోరూ.

రాజకీయాల్లో విశాఖకు ప్రత్యేక స్థానముంది. విభజన తర్వాత ఆర్థిక రాజధానిగా వెలుగొందుతోంది. రాజకీయంగా కూడా చూసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు అధిక ప్రాధాన్యమిస్తూ పర్యటనలు చేస్తున్నారు. మధ్యతరగతి నివాసముండే విశాఖ నగర రాజకీయాలను తనదైన శైలిలో ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ ప్రజాసమస్యలను పట్టించుకో వడం లేదు. విభజన హామీల అమలు ప్రభావం విశాఖపైనా పడింది.విశాఖ నగర పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పెద్ద ఎత్తున సమస్యలు తిష్ట వేశాయి. వీటిల్లో ఆరుగురు టిడిపికి చెందినవారు 2014లో గెలుపొందారు. 

తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం : ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణబాబు (టిడిపి) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ భూ భాగోతాలు ఎక్కువ. సముద్ర తీరం చుట్టూ ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఉంటుంది. కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ (సిఆర్‌జెడ్‌) పరిధిలో ఉంది. కానీ బీచ్‌ చుట్టూ అక్రమ కట్టడాలతో వర్థిల్లుతోంది. 2012 సంవత్సరం నాటి సిఆర్‌జెడ్‌ చట్టానికి తూట్లు పొడిచారు. 

ఉత్తరం: అసెంబ్లీ సెగ్మెంట్‌లో జాతీయ రహదారి చుట్టూ ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉంటుంది. ట్రాఫిక్‌ సమస్యలు అనేకం ఉన్నాయి. బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాతీయ రహదారి ఉన్నా ఎక్కడా ఒక బస్‌ షెల్టర్‌ లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 2012 నాటి బస్‌ షెల్టర్‌ హామీలను కూడా నిర్వహించలేదు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం జాతీయ రహదారిలో నిర్మాణం జరిగితేనే ట్రాఫిక్‌ సమస్య ఈ సెగ్మెంట్‌లో పరిష్కారమవుతుంది. 

పశ్చిమం: ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌ ప్రధానంగా జాతీయ రహదారిలోని ఎన్‌ఎడి కొత్తరోడ్డు వరకూ ఉంటుంది.. పెతకం శెట్టి గణబాబు (టిడిపి ఎమ్మెల్యే) ఎన్‌ఎడి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల్లో టిడిపి శ్రేణులకే దక్కడంతో ప్రజానీకంలో చర్చ జరుగుతోంది.

దక్షిణం: వైజాగ్‌ సిటీని అల్లాడిస్తున్న ప్రధాన సమస్యల్లో పోర్టు కాలుష్యం ఒకటి. అసెంబ్లీ సెగ్మెంట్‌ అంతా కాలుష్యంతో నిండి పోతోంది. ఏళ్లతరబడి పోర్టు నుంచి వెలువడే కాలుష్యంపై చర్యల్లేవు. వృత్తి రీత్యా మత్స్యకారులే అత్యధికంగా నివసిస్తున్న సెగ్మెంట్‌ ఇది. ఈ సమస్యను సిట్టింగ్‌ టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ పరిష్కరించలేదు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డిసిఐఎల్‌) ప్రయివేటీకరణకు కేంద్రం 2017లో పన్నిన కుట్రలపై సొంత నియోజకవర్గమైనా వాసుపల్లి, టిడిపి యావత్‌ పార్టీ నుంచి స్పందన లేదు. ఉద్యోగ, కార్మికులపై స్థానిక ఎమ్మెల్యే పట్ల నిరసన వ్యక్తమైంది.

గాజువాక: ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించి ప్రజా సమస్యలు కోకొల్లలుగా ఉన్నా టిడిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పట్టని రీతిన వ్యవహరిస్తున్నారు. తన తండ్రి గతంలో చేసిన భూ కబ్జాలకు ఆయన వత్తాసు పలుకుతున్నారు. గాజువాక పరిధిలో పరిశ్రమలు, కార్మికులు అధికం. ఇళ్ల సమస్య ప్రధానంగా వేధిస్తోంది. ప్రభుత్వ పరంగా ఇళ్లను మంజూరు చేయించడంలో పల్లాపై విమర్శలున్నాయి. ఇక్కడ పలు పరిశ్రమలతో సహా ఆర్‌ఐఎన్‌ఎల్‌ (స్టీల్‌ప్లాంట్‌) ఉంది. సొంత గనుల కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గనుల కేటాయింపు జరగడం లేదు. 2019 ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, జనసేన ఆధ్వర్యాన ప్రజాసమస్యలపై ప్రణాళికలు వేస్తున్నాయి.

భీమిలి : ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. భూ కబ్జాలకు ప్రధాన కేంద్రం ఇది. విశాఖలో రూ.20వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రయివేటు భూములు కబ్జాకు గురయ్యాయి. మంత్రి గంటాపై భూకుంభకోణాలు, అవినీతికి సంబంధించి మరో మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపణలు గుప్పించిన సందర్భాలున్నాయి. గడచిన నాలుగేళ్లలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం పెద్ద ఎత్తున సాగింది. ఇక్కడ మరో టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్‌ ఈసారి ఎమ్మెల్యేగా పోటీపడడంతో వీరిద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి.

పెందుర్తి : నియోజకవర్గంలో సింహాచలం దేవస్థానం భూముల సమస్యను చంద్రబాబు ప్రభుత్వం వివాదాస్పదంగా మార్చేసింది. సిట్టింగ్‌ టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై అవినీతి ఆరోపణలు, ఫార్మా కంపెనీ యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహ రిస్తారన్న విమర్శలున్నాయి. ఐదు గ్రామాల భూ సమస్య పరిష్కారం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించ నందున బండారుపై రాజకీయంగా నీలినీడలు అలముకుంటున్నాయి

Related Posts