YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాంట్రాక్టర్లకు ఆదాయ వనరుగా ఉపాధి హామీ పథకం

కాంట్రాక్టర్లకు ఆదాయ వనరుగా ఉపాధి హామీ పథకం

గ్రామీణ పేదలకు పని కల్పించడంపై కాకుండా కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చే మెటీరియల్‌ కాంపొనెంట్‌ వినియోగంపైనే ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తోంది. ఉపాధి హామీ పథకంలో 2018-19 ఆర్థిక సంవత్సరం డిసెంబరు చివరి వారానికి లేబర్‌ బడ్జెట్‌ రూ.4,911.10 కోట్లు వినియోగించాల్సి ఉండగా రూ.3,887.57 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అదే మెటీరియల్‌ బడ్జెట్‌ రూ.2,591.72 కోట్లకుగానూ లక్ష్యాన్ని మించి రూ.2,670.41 కోట్లు ఖర్చు చేశారు. అంటే వేతనం భాగం లక్ష్యం 79.1 శాతం మాత్రమే చేరుకోగా మెటీరియల్‌ కాంపొనెంట్‌ మాత్రం 103.03 శాతం ఖర్చు చేశారు. అంటే ఒక ఊళ్లో పేదలకు పని కల్పించడానికి వంద రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయిస్తే 79 రూపాయలే ఖర్చు చేసి, మెటీరియల్‌కు వంద ఖర్చు చెయ్యమంటే 103 రూపాయలు ఖర్చు చేశారన్నమాట. కాబట్టి పేదలకు పని కల్పించి వారి ఆదాయం పెంచడం కంటే మెటీరియల్‌ బడ్జెట్‌ వినియోగించి అధికార పార్టీ అనుయాయులకు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం జరుగుతోందన్నమాట. మెటీరియల్‌ పనుల్లో ప్రధానంగా సిసి రోడ్లు, పంచాయతీ, మండల పరిషత్‌ భవనాలు, ఎస్‌డబ్ల్యూఎం షెడ్లు, సోక్‌పిట్‌లు, భూగర్భ డ్రైయినేజి వంటి పనులు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఒక్క నెల్లూరు మినహా అన్ని జిల్లాలు వేతన లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడ్డాయి. మెటీరియల్‌ కాంపొనెంట్‌ వినియోగంలో ఐదు జిల్లాలు లక్ష్యాన్ని మించి నిధులు ఖర్చు చేశాయి. లేబర్‌ బడ్జెట్‌ వినియోగంలో వెనకబడి ఉన్న జిల్లాలే మెటీరియల్‌ బడ్జెట్‌ వినియోగంలో ముందున్నాయి. వర్షాభావంతో కురువు పరిస్థితులు నెలకొని వ్యవసాయ పనులు లేని జిల్లాలైన కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు లేబర్‌ బడ్జెట్‌ లక్ష్యం ప్రకారం కూలీలకు ఉపాధి కల్పించకపోవడం దారుణం. ప్రకాశం జిల్లా 90.19 శాతం లక్ష్యానికి చేరువలో ఉండగా, నెల్లూరు జిల్లా లక్ష్యాన్ని మించి 4.42 శాతం అదనంగా ఖర్చు చేసింది. గుంటూరు జిల్లా రూ.117.74 కోట్లు మెటీరియల్‌కు ఖర్చు చేయాల్సి ఉండగా రూ.253.31 కోట్లు ఖర్చు పెట్టారు. తరువాతి స్థానంలో కృష్ణా జిల్లా రూ.109.43 కోట్ల, తూర్పుగోదావరి రూ.62.42 కోట్లు అదనంగా ఖర్చు చేశాయి. గ్రామీణ పేదలకు పని కల్పించి వారికి ఆదాయం లభించేలా చేయాలన్న ఉపాధి హామీ చట్టం ప్రధాన లక్ష్యం దెబ్బ తింటోంది. టిడిపి ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో వేతనం వాటా 63.11 శాతం నుండి 56.91 శాతానికి తగ్గగా మెటీరియల్‌ వాటా 36.88 శాతం నుండి 43.08 శాతానికి పెరగడం గమనార్హం.

ఉపాధి హామీ మెటీరియల్‌ ఖర్చు పెరిగిన తీరు

                                       2014-15లో            2018-19 (డిసెంబరు వరకు)

మొత్తం వ్యయం                      2,966.40                  6,830.78

వేతనాలు                        1,872.14 (63.11 శాతం)      3,887.50 (56.91 శాతం)

మెటీరిల్‌, 

పరిపాలనా ఖర్చులు            1,094.26 (36.88 శాతం)   2,943.21 (43.08 శాతం)

Related Posts