YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి వెళ్లిన ఫోరెన్సిక్ నిపుణులు వంద పోస్టులు ఖాళీ

ఏపీకి వెళ్లిన ఫోరెన్సిక్ నిపుణులు  వంద పోస్టులు ఖాళీ

రాష్ట్రంలో కేసుల దర్యాప్తు వేగవంతంగా జరగాలన్నా, కోర్టులకు అవసరమైన ఆధారాలను సమర్పించాలన్నా నేర పరిశోధనలో రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కీలక పాత్ర వహిస్తుంది. రాను రాను ఎఫ్‌ఎస్‌ఎల్‌ సపోర్టు లేనిదే దాదాపుగా కేసులన్నీ కోర్టులలో వీగి పోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ పరిస్థితిని అధిగమించడానికి పోలీసు, ఫోరె న్సిక్‌ విభాగం, పబ్లిక్‌ ప్రాసిక్యూ టర్‌ల మధ్య సమన్వయాన్ని పెంచడానికి కృషి చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు అంటు న్నారు. అయితే ఇందులో ఫోరె న్సిక్‌ ల్యాబ్‌కు అవసరమైన జవసత్వాలు కల్పించక పోతే ఆశించిన ఫలితాలను రాబట్టడం కష్టమేనని ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణులు పెదవి విరుస్తున్నారు. కారణం విభజన చట్టం లోని పదో షెడ్యూల్‌లో గత ఐదేండ్లుగా కొనసాగుతున్న రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఎట్టకేలకు గత డిసెంబర్‌ 31న తెలంగాణ, ఏపీ రాష్ట్ర విభాగాలుగా విడిపోయింది. ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్‌ విభాగంలోకి వెళ్లిన ఫోరెన్సిక్‌ నిపుణులు, సిబ్బంది, సాంకేతిక నిపుణులకు జనవరి నెల నుంచి ఏపీ ట్రెజరీ నుంచే జీతాలు అందనున్నాయి. విభజన జరిగినందుకు తెలంగాణ ఎఫ్‌ఎస్‌ఎల్‌ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది కొంత మేరకు సంతోషంగా ఉన్నప్పటికీ దాదాపు వందకు పైగా సైంటిస్టులు, నిపుణులు, సాంకేతిక విభాగం సిబ్బంది కొరతను తాజాగా ఎదుర్కొంటున్నారు. విభజన జరగక ముందు కూడా నిపుణులు, సిబ్బంది కొరత ఈ విభాగానికి ఉంది. దీంతో వందల సంఖ్యలో వివిధ పొలీసు స్టేషన్‌ల నుంచి పరిశోధనల కోసం వచ్చిన వివిధ కేసులకు సంబంధించిన శాంపిళ్లు, ఇతర ఆధారాల విశ్లేషణలో తీవ్రమైన జాప్యం కొనసాగుతున్నది. ఇక విభజన జరిగాక చాలా వరకు నిపుణులు ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరిధిలోకి వెళ్లడంతో మరిన్ని ఇబ్బందులను తెలంగాణ ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఈ పరిస్థితిలో మరో మూడు నెలల పాటు ఏపీకి చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు, సైంటిస్టులు ఇక్కడ పెండింగ్‌లో ఉన్న కేసుల పరిశోధనకు సహకరించేలా ఉన్నతాధికారులు చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ మూడు నెలలలోగా కొత్తగా అవసరమైన నిపుణుల రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందా అనే సందేహాలు కూడా ఈ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఈ ప్రక్రియ పూర్తయ్యాకే రిక్రూట్‌మెంట్‌ను రాష్ట్ర పోలీసు నియామక విభాగం ప్రారంభిచాల్సి ఉంటుంది. అదే సమయంలో మరో వైపు పార్లమెంటు ఎన్నికల నగారా మోగించడానికి కేంద్ర సర్కారు కూడా సిద్ధమవుతున్నది. ఆ ప్రక్రియ కూడా మొదలైతే ఎఫ్‌ఎస్‌ఎల్‌లోకి కొత్త నిపుణుల నియామకాలు జరగడం సాధ్యం కాని పరిస్థితి నెలకొన్నదని ఈ విభాగం అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఒక సైబర్‌క్రైమ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని పోలీసు బాస్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మొదట ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు అవసరమైన సైంటిస్టులు, సాంకేతిక సిబ్బంది నియామకాలపై మొదట ప్రాధాన్యతనివ్వాలని లేకపోతే వివిధ జిల్లాల నుంచి వచ్చి పడుతున్న వివిధ నేరాల విశ్లేషణలకు చెందిన శాంపిళ్ల పరీక్షలు పూర్తి కావడానికి నెలల తరబడి సమయం పట్టే అవకాశం ఉన్నదని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో వందల సంఖ్యలో కేసుల పరిశోధనలో తీవ్రమైన జాప్యం ఏర్పడే ప్రమాదం ఉన్నదని కూడా వారు స్పష్టం చేస్తున్నారు.

Related Posts