రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వైరస్ స్వైరవిహారం చేస్తున్నది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చలి తీవ్రత పెరగడంతో వ్యాధి వ్యాప్తి చెందుతున్నది. హైదరాబాద్‌లో కేవలం 10 రోజుల్లోనే 83 మందికి వ్యాధి సోకిందని వైద్యాధికారుల పరీక్షల్లో తేలింది. జనవరి 1 నుంచి 10 వరకు వరకు 483 మంది శాంపిళ్లను పరీక్షించగా వీరిలో 83 మందికి ఈ వ్యాధి సోకిందని వెల్లడైంది. నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫ్లూతో పలువురు రోగులు చేరారు. సాధారణంగా నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి రోజుకు సగటున 600 రోగులు అనారోగ్యంతో వస్తుంటారు. కానీ, చలి తీవ్రత పెరగడంతో రోజుకు 1000 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారని వైద్యులు చెప్పారు. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వైరస్ విజృంభిస్తున్నదని వివరించారు. స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఒక పక్క రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతుంటే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించడంలేదనే విమర్శలున్నాయి. స్వైన్‌ఫ్లూ బాధితుని కుటుంబ సభ్యులను, సన్నిహితులను గుర్తించి, ముందస్తు చికిత్సనందించడం... మరొకరికి వ్యాప్తికాకుండా అడ్డుకోవడంలో వైద్య సిబ్బంది చురుకైన పాత్ర పోషించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అనధికారికంగా స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య రెట్టింపుస్థాయిలో ఉన్నదని పలువురు పెదవి విరుస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో వ్యాధిగ్రస్తులు ఎక్కువ సంఖ్యలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్ల వెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అవుతాయి. ఇక గర్భిణులు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, చిన్న పిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు సులభంగా వ్యాపించే ప్రమాదం ఉంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాల్లోకి ప్రవేశించి రెండు గంటలకుపైగా జీవిస్తుంది. ఫ్లూ లక్షణాలతో బాధపడే వారికి దూరంగా ఉండాలి. ముక్కుకు మాస్కు ధరించండంతోపాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. జనసమ్మర్థ ప్రాంతాలకు వెళ్లక పోవడం ఉత్తమం. తీర్థయాత్రలు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవడం చేయరాదు. చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోరాదని వైద్యులు తెలిపారు