YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అందరి చూపు...ఒడిశా వైపు

 అందరి చూపు...ఒడిశా వైపు

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూటే సపరేటు. ఆయన ఎవరికీ దగ్గర కాదు…. అలాగని ఎవరికీ దూరం కాదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అందరివాడిగా కన్పిస్తారు. ఎన్నికల సమయానికి ఆయన అందనివాడిగా అగుపిస్తారు. ఇదే నవీన్ పట్నాయక్ విజయరహస్యం. నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బిజూ జనతాదళ్ అప్రతిహత విజయాల వెనక రహస్యమిదే. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తూనే త్రిముఖపోటీలో ఆయన నెగ్గుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను రెండు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు చీల్చుకోవడం ద్వారా మరోసారి అందలమెక్కాలని నవీన్ ఉవ్విళ్లూరుతున్నారు.నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా 19 ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు. వరస విజయాలతో ఆయన రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే దీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తోంది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన అనేక సంక్షేమ పథకాలకు తెరదీశారు. దీనికి తోడు బీజేపీ ఒడిశాలో బలం పెంచుకుంటోంది. కాంగ్రెస్ బలహీన పడుతోంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న నవీన్ ఒంటరిపోరు తనను మరోసారి అందలం ఎక్కిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ బలాన్ని నిరూపించుకుంది. ఈసారి జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో స్థానాల సంఖ్యను పెంచుకోవాలని కమలం పార్టీ భావిస్తోంది. అందుకోసం క్షేత్రస్థాయిలో ప్రణాళికను అమలు చేస్తోంది. గత ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పార్టీకి బంపర్ మెజారిటీ లభించింది. మొత్తం 147 స్థానాలకు గాను 117 సీట్లను బీజూ జనతాదళ్ సాధించింది. 21 లోక్ సభ స్థానాలకు గాను 20 సీట్లను సాధించింది. ఇన్ని స్థానాల్లో విజయం సాధించినా నవీన్ ఆశించిన రీతిలో అభివృద్ధి చేయలేకపోయారన్న విమర్శలు ప్రత్యర్థి పార్టీల నుంచి విన్పిస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనపడుతోంది. బీజేపీని ఒడిశాలో నిలువరించాలన్న రాహుల్ సూచనలను ఇక్కడి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆచరణలో పెట్టారు. మిషన్ 15 టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఒడిశాలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. లోక్ సభ స్థానాల్లో 15 సీట్లను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. అయితే అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని ఏ మేరకు విజయతీరాలకు చేరుస్తాయో తెలియదు. కాంగ్రెస్ బలం పెరిగితే అది తనకే లాభమని నవీన్ పట్నాయక్ లెక్కలు వేస్తున్నారు. మొత్తం మీద త్రిముఖ పోటీ మరోసారి తనను సీఎం చేస్తుందన్న నమ్మకంతో పట్నాయక్ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి

Related Posts