పాతనీరు పోయి కొత్తనీరు వస్తే ఏ వ్యవస్థలో అయినా ప్రక్షాళన మొదలు అవుతుంది. ఆవిధంగా రాజకీయాల్లో కృషిచేసిన వారిలో ఎన్టీఆర్ తెలుగు రాజకీయాల్లో ఆద్యుడు. ఎంతోకొంత మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కూడా కొత్త ముఖాలను పరిచయం చేసింది, అనే చెప్పొచ్చు. తాజాగా ఆ స్థాయిలో జనసేన పార్టీ నుంచి కొత్తగా రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకునే వారు టికెట్లు ఆశిస్తున్నారు. రాజకీయాల్లో మార్పు తేవడానికె జనసేన ఆవిర్భవించింది అని ప్రకటించిన పవన్ పై పెట్టుకున్న గంపెడాశ పెట్టుకున్నారు ఆయనంటే ప్రాణాలు ఇచ్చేవారు. అయితే ఆ పార్టీ పక్క పార్టీల నేతల చేరికల కోసం ఎదురు చూడటంతో నిరాశే క్యాడర్ కి ఎదురుఅయ్యేలా ఉందని ఆందోళన మొదలైంది.చూసి చూసి మొహం మొత్తిన నేతలు వస్తా అన్నా తీసుకోను. ఏ పార్టీలో లేకుండా కొత్త రాజకీయం ఆశిస్తున్న వారితోనే జనసేన ప్రజల్లోకి వెళుతుంది అని గతంలో ప్రకటించారు పవన్ కళ్యాణ్. అలాగే టికెట్ ఆశించి జనసేనలో చేరవద్దని కూడా పవన్ స్పష్టం చేసేవారు. రెండో పాయింట్ పై ఇప్పటికి జనసేనాని నిలబడినప్పటికీ పాతనేతలను తీసుకోవడంలో పెట్టుకున్న నిబంధనలను సడలింపులు, సవరణలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు జనసేన తన సిద్ధాంతాలు పూర్తిగా సడలించుకుని సీనియర్లు, మాజీలు, తాజా నాయకుల కోసం గేట్లు బార్లా తెరిచింది. నేటి రాజకీయాల్లో మడి కట్టుకుని కూర్చుంటే మటాష్ అయిపోతామని పీకే కు కోటరీ నూరిపోయడంతో కొత్తవారితో రాజకీయం అనే పవన్ డ్రీమ్ కి మంగళం పాడక తప్పలేదన్న మాట ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది.తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థాపించినప్పుడు దాదాపు అన్ని కొత్త ముఖాలే. 80 నుంచి 90 శాతం విద్యావంతులను చూసి ఆయన ఎంపిక చేసి బరిలో నిలిపి చరిత్సృష్టించారు. ఎన్టీఆర్ చెప్పును నిలబడితే నెగ్గి తీరుతుందని ఆ రోజుల్లో ప్రజల్లో చర్చ నడిచేది. అలా కొత్తగా వచ్చిన వారు నేటికి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఎక్కువమంది టిడిపి లో ఉండగా చాలామంది కాంగ్రెస్, బిజెపి లకు షిఫ్ట్ అయ్యారు. కెసిఆర్ వంటివారు సొంత పార్టీనే స్థాపించారు. ఇలా కొత్తగా వచ్చినవారికి గండిపేట లో రాజకీయ శిక్షణ ఇప్పించేవారు.ఇక చిరంజీవి పార్టీ కూడా చరిత్ర సృస్ట్టించేదే. అయితే ఆయన పార్టీ ఘోరంగా దెబ్బతినడం కూడా జనసేన ప్రయోగాల జోలికి వెళ్లేందుకు వెనుకాడుతున్న పరిస్థితి కి కారణం అంటున్నారు విశ్లేషకులు. ప్రజారాజ్యం లోకి మాజీ లు, తాజాలు వచ్చి చేరినా ఎక్కువమంది కొత్తవారితోనే చిరు ధైర్యం గా యుద్ధంలోకి దిగారు. స్వాతంత్య్రం వచ్చాకా రాజకీయ గుర్తింపు పొందని కులాలను సైతం ఎంపిక చేసి సరికొత్త రాజకీయానికి తెరతీసినా ఆయన ప్రయత్నాలు విఫలం అయిపోయాయి.టిడిపి, వైసిపిలో వున్న మాజీలు అయితే జనసేన తీర్ధం పుచ్చుకోవడం లో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే అధికారపార్టీ ఎమ్యెల్యేలుగా ఉన్నవారిలో జనసేన లో చేరాలంటే చివరివరకు అధికారాన్ని అనుభవించి ఎన్నికల నోటిఫికేషన్ ముందు లేదా తరువాత మాత్రమే పవన్ చెంత చేరొచ్చు. దాంతో వివిధ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కార్యక్రమాలకు వ్యయప్రయాసలు భరించే వారందరికీ షాక్ లు తగిలే పరిస్థితి. ఇవన్నీ గమనించే పార్టీలో చేరేవారు సీట్లు ఆశించి రాకండని పవన్ ముందే రాబోయే అసంతృప్తులు లెక్కేసి చెప్పేశారు. జనసేనకు కర్త, కర్మ, క్రియ అన్ని తానై వ్యవహరిస్తుండటంతో భవిష్యత్తులో జనసేన అధినేతపై దుమ్మెత్తడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. అయితే కొత్తవారితో అనుకున్న రాజకీయ ప్రయోగం, పవన్ లాంటి ఇమేజ్ వున్న స్టార్ నటుడు ఛరిష్మా వున్న నాయకుడు కూడా చేయలేకపోవడం మాత్రం చర్చనీయాంశమే.