ఇంకా ఎన్నికలకు వంద రోజులే ఉన్నాయని సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో అన్నారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని నేతలకుసూచించారు. పార్టీ మనకోసం ఏం చేసింది అనేది కాదని...పార్టీ కోసం మనం ఏం చేయాలని ఆలోచించే సమయం ఇది అని అన్నారు. నిరంకుశత్వాన్ని ఎదిరించడం ఎన్టీఆర్ నేర్పిందే అని అన్నారు. ఇప్పుడు నిరంకుశత్వం బీజేపీ రూపంలో పెత్తందారీతనం నరేంద్ర మోదీ రూపంలో ఉందన్నారు. అందుకే బీజేపీపై ధర్మపోరాటం చేస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. శనివారం కోల్కతాలో బీజేపీయేతర పార్టీల ర్యాలీకి హాజరవుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్, వైసీపీ మినహా అందరూ కోల్కతా వస్తున్నారని...దీన్ని బట్టే ఆ రెండు పార్టీలు ఎక్కడ ఉన్నాయో తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. మోదీ అనుకూల కూటమి, వ్యతిరేక కూటమి అని రెండే వున్నా యని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, వైసీపీ లు మోదీ అనుకూల కూటమిలో ఉన్నట్లే అని పేర్కొన్నారు. అసత్యాలతో దుష్ప్రచారం చేసేందుకే కడపలో బీజేపీ సభ ఏర్పటు చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి.. ఇక్కడికొచ్చి బీసీల సంక్షేమంపై మాట్లాడుతున్నాని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్దంతి పై మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. పేదరికంపై గెలుపే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని అన్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని, అందుకే పింఛన్లను 10 రెట్లు పెంచామని పేర్కొన్నారు. పేదల సంక్షేమాన్ని మూడు విధాలుగా చేస్తున్నామన్నారు. నేరుగా నగదు బదిలీ, విద్య, వైద్య, ఆహారం రూపంలో సంక్షేమం కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి కుటుంబం ఆదాయం పెంచడం.. నెలకు కనీసం రూ.10వేల ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల ఆదాయం పెరిగి, జీవన ప్రమాణాలు మెరుగుపడాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారని అన్నారు.