ఏపీ సీఎం చంద్రబాబుతో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం భేటీ కావడం రాజకీయంగా కలకలం రేపింది. 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాజగోపాల్ మళ్లీ యాక్టివ్ కావడానికి ప్రయత్నిస్తున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సందర్భంగా తాను చేయించిన సర్వేలో ప్రజాకూటమిదే విజయమని లగడపాటి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. దీంతో ఆంధ్రా ఆక్టోపస్‌గా ముద్ర పడిన రాజగోపాల్ పరువు మొత్తం గంగలో కలిసింది. అప్పటివరకు ఆయన సర్వేలపై ఉన్న క్రెడిబులిటీ మొత్తం పోయింది. లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబు ఏజెంట్ అని, ఆయన సలహాతో తప్పుడు సర్వేను ప్రకటించారని టీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తిపోశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా కంట కనపడని ఆయన.. తాజాగా అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సీఎంతో లగడపాటి భేటీ అయ్యారు. దీనిపై రాజగోపాల్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ఈ నెల 27వ తేదీన తన ఇంట్లో జరిగే శుభకార్యానికి చంద్రబాబును ఆహ్వానించేందుకే వచ్చినట్లు తెలిపారు. దీనికి రాజకీయాలను ఆపాదించొద్దని కోరారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌పై ప్రశ్నించగా.. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఫెడరల్ ఫ్రంట్‌పై తానేమీ మాట్లాడనని స్పష్టం చేశారు.