ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి రెండు సార్లు జీవనదానం లభించింది. క్రీజులోకి వచ్చిన వెంటనే ఇచ్చిన సులువైన క్యాచ్‌ని ఫీల్డర్ మాక్స్‌వెల్ జారవిడచగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే కీపర్ క్యాచ్ ఇచ్చినా.. ఆస్ట్రేలియా టీమ్‌కి స్పష్టత లేకపోవడంతో ఔట్ కోసం సరిగా అప్పీల్ చేయలేదు. దీంతో.. ధోనీకి లైఫ్ లభించింది. 231 పరుగుల లక్ష్యఛేదనలో.. భారత్ జట్టు విజయానికి 128 బంతుల్లో 122 పరుగులు చేయాల్సిన దశలో ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ విసిరిన బంతిని హిట్ చేసేందుకు ధోనీ క్రీజు వెలుపలికి వచ్చాడు. కానీ.. బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. బ్యాట్‌కి బంతి తాకిందా..? లేదా..? అనే స్పష్టత లేకపోవడంతో బౌలర్‌తో పాటు వికెట్ కీపర్, సమీపంలోని ఫీల్డర్లు ఏదో మొక్కుబడిగా అప్పీల్ చేశారు. దీంతో.. అంపైర్ స్పందించలేదు. కనీసం వికెట్ కీపర్ గట్టిగా అప్పీల్ చేసుంటే..? అంపైర్ స్పందించేవాడేమో..? అలాకాకున్నా.. కనీసం ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ డీఆర్‌ఎస్‌కి వెళ్లే సాహసమైనా చేసేవాడు..!