శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇప్పటివరకూ 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు 51 మంది ఆలయంలో ప్రవేశించారని కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టుకు సమర్పించిన నోట్‌లో పేర్కొంది. ఆలయ సంప్రదాయం ప్రకారం రుతుక్రమంలో ఉన్న పది నుంచి 50 సంవత్సరాల లోపు బాలికలు, మహిళలను ఆలయంలోకి అనుమతించని సంగతి తెలిసిందే.అయితే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గత ఏడాది సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. పది నుంచి 50 ఏళ్లలోపు మహిళల ఆలయ ప్రవేశం సంప్రదాయాలకు విరుద్ధమని హిందూ సంఘాలు సుప్రీం తీర్పుపై భగ్గుమన్నాయి. మహిళలను ఆలయంలోకి రాకుండా ఎక్కడికక్కడ ఆందోళనకారులు అడ్డుకోవడంతో పలుమార్లు ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఈనెల 2న ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందులు ఆందోళనకారుల నిరసనలను నిలువరిస్తూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.