ప్రతి ఎన్నికకూ ప్రచార సరళి మారుతోంది. జనాల తెలివి కూడా ఎప్పటికపుడు పెరగడంతో వారిని ఆకట్టుకోవడానికి నాయకులు కూడా కొత్త ఎత్తులు వేయాల్సివస్తోంది. సంప్రదాయ పద్ధతుల్లో ప్రచారం చేస్తే ఇప్పటి జనం స్పందించడం లేదు సరి కదా తిప్పికొడుతున్నారు. దాంతో నాయకులు కూడా ట్రెండ్ ని బట్టి నడవాలనుకుంటున్నారు. ఈ విషయంలో విశాఖ జిల్లాలో వైసీపీ చాలా ముందుంది. ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్ధిగా ఉంటారనుకుంటున్న ఎంవీవీ సత్యనారాయణ తనదైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఏకంగా క్రికెట్ దేవుడు కపిల్ దేవ్ నే విశాఖకు పిలిపించి మరీ యువత మనసు కొల్లగొట్టారు.యువతకు క్రికెట్ అంటే విపరీతమైన అభిమానం. దాన్ని చూసుకుని ఇపుడు వైసీపీ నేత సత్యనారాయణ తన ప్రచారానికి బాగా వాడేసుకుంటున్నారు. వైసీపీ తరఫున నగరంలో వరసగా క్రికెట్ పోటీలను నిర్వహించడమే కాదు, ఏకంగా క్రికెట్ స్టార్ కపిల్ దేవ్ ని విశాఖ రప్పించారు. కపిల్ దేవ్ ద్వారా విజేతలకు బహుమతులు ఇప్పించారు. వైఎస్సార్ పేరు మీద ట్రోఫీ నిర్వహించి మరీ కొన్నళ్ళ పాటు విశాఖలొని యువతను ఆయన ఈ విధంగా కట్టిపడేశారు. వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లు కీలకంగా మారుతున్న నేపధ్యంలో వైసీపీ నేత తీసుకున్న ఈ నిర్ణయంతో ఇపుడు ఆయన చాలా సులువుగా అందరికీ పరిచయం అయిపోయారు. క్రికెట్ పరంగా నగరంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడమే కాదు. విశాఖను క్రికెట్ లో ముందు స్థానంలో నిలుపుతానని సత్యనారాయణ అంటున్నారు. మేటి క్రీడాకారులను తయారు చేస్తానని కూడా ఆయన చెబుతున్నారు.క మరో వైసీపీ నేత ఉన్నారు. ఈయన విశాఖ ఉత్తరం అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు. ఈయన కూడా పండగలను, ముఖ్య సందర్భాలను తన ప్రచారానికి అనువుగా వాడేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ నెల రోజులూ ముగ్గుల పోటీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మహిళా లోకం మద్దతు కూడగడుతున్నారు. దాంతో ఎన్నడూ లేని విధంగా ఉత్తర నియోజకవర్గంలో ఈసారి పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు జరిగాయి. అదే విధంగా మహిళలకు సంబంధించి కుట్టు మిషన్ల పంపిణీ, వారికి ఉచితంగా వ్రుత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ వంటివి నిర్వహించడం ద్వారా ఆ వర్గం మద్దతు నాదేనని ఈయన ధీమాగా ఉంటున్నారు. మరో వైసీపీ నాయకుడు సైతం ప్రజాహితం అంటున్నారు. విశాఖలో పర్యావరణ కాలుష్యం పై అవగాహన, ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం వంటివి ఆయన జనంలోకి ప్రచారం చేస్తూ తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈయన కూడా ఉత్తరం అసెంబ్లీ సీటుని ఆశిస్తున్నారు. దాంతో ప్లాసిక్ కి బదులుగా ఖద్దరుతో చేసిన బ్యాగులను ఉచితంగా పంచుతూ ప్రజలకు చేరువ అవుతున్నారు. వాటి మీద పార్టీ పేరు, తన పేరు ఉండేలా చూసుకుంటూ ఆయన చేస్తున్న ప్రచారం బాగానే సక్సెస్ అవుతోంది. ఈ విధంగా లక్షల్లో బ్యాగుల పంపిణీకి రెడీ అయిపోయారు. నిజానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఇలాంటి పనులు చేయడానికి కుదరదు, దాంతో తెలివిడి బాగా కలిగిన వైసీపీ నేతలు స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా తమ ప్రచారాన్ని సాగిస్తూ జనానికి మేలు కూడా చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.