నెల్లూరులో టీడీపీ నేతల మధ్య సాగుతున్న బెట్టు రాజకీయా లు.. ఆ పార్టీకి అశనిపాతంగా పరిణమించాయి. అందరూ మేధావులు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వారే కావడం ఇక్కడ పార్టీకి ప్లస్ కావాల్సింది పోయి.. మైనస్ అవుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాజకీయాల్లో నేతల మధ్య వైరం ఉంటుంది. కానీ, అది పార్టీలు వేరుగా ఉన్న సమయంలో. కానీ, నేడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కొందరు అదే వైరాన్ని కొనసాగిస్తుండడం తెరవెనుక `నువ్వెంత` అంటే నువ్వెంత అనుకులానే వ్యాఖ్యలు చేసుకోవడం, తెర వెలుపల ఎవరికి వారు గా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఇక్కడ పార్టీని నష్టపరిచే చర్యలే అవుతాయి.రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు.అయినా కూడా పైచేయి సాధించాలనే ఒకే ఒక్క పట్టుదల ఇక్కడి టీడీపీలో కీలక నేతల మధ్య దోబూచులాడుతోంది. ఫలితంగా మనుషులు ఎదురైనప్పుడు చూపులు కలుపుకొని చేతులు నలుపుకొంటున్నా.. మనసులు మాత్రం వేటికవిగానే రాజకీయాలు చేస్తున్నాయి. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిలకు దశాబ్దాల వైరం ఉంది. కానీ, ఇప్పుడు ఒకే గూటిలో ఉన్నారు. అధినేత చంద్రబాబు కూడా వీరికి అనేక సూచనలు సలహాలు ఇస్తున్నారు. వీరికి కూడా వ్యక్తిగతంగా పార్టీని డెవలప్ చేయాలనే కృత నిశ్చయం ఉంది. ఏ వేదిక ఎక్కినా ఇదే చెబుతున్నారు.క్షేత్రస్థాయిలో కార్యాచరణకు వచ్చే సరికి మాత్రం ఎవరికివారే యమునాతీరే అన్నట్టుగా రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇది ఎవరికి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది? ఈ విషయాన్ని వారే ఆలోచించుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నేతలు.. వరుస విజయాలు కైవసం చేసుకుంటున్న నాయకులు కూడా కొంత మేరకు తగ్గి ఉండడం వారికే కాదు.. పార్టీకి కూడా ప్రయోజనంగా మారుతుంది. ఇక, గత ఎన్నికల్లో ఓటమిపాలైన పరసారత్నం వంటివారికి రాజకీయ అనుభవం ఉంది. ఇలాంటి వారు దూకుడుగానే ఉన్నారు. కానీ, క్షేత్రస్థాయిలో వర్గ పోరును తట్టుకోలేక మౌనంగా ఉంటున్నారు. దీనివల్ల ఆయనకు జరిగే నష్టం కన్నా పార్టీకి ఎక్కువ ప్రమాదం. ఇతర పార్టీల నుంచి వచ్చిన బొమ్మిరెడ్డి వంటివారికి జిల్లాపై పూర్తి పట్టుంది. ఎక్కడ ఎలాంటి రాజకీయాలు చేయాలో కూడా తెలుసు. అయితే, పదవుల వేటలో అలిసిపోతున్నారే తప్ప.. పార్టీని పట్టాలెక్కించేందుకు మాత్రం వ్యూహాలను రెడీ చేసుకోలేకపోతున్నారు. వెరసి మొత్తంగా నెల్లూరు జిల్లాలో టీడీపీలోని రాజకీయ దురంధరులు ఇప్పటికైనా..ఏకతాటిపైకి రావడం అత్యవసరం. అవసరం కూడా!!