ప్రతి వ్యవస్థలో పనిచేసేవారికి పదవి విరమణ వయస్సు వుంది. భీష్ముడు తన చావు తాను కోరుకుంటే తప్ప చావులేనట్లే తమంతట తామే పదవీవిరమణ ప్రకటించుకునే అవకాశం రాజకీయాల్లో వున్న నేతలకు రాజ్యాంగం కల్పించింది. దాంతో చనిపోయే వరకు పదవులు పట్టుకుని వేళ్ళాడే ధోరణి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నడుస్తుంది. స్థిత ప్రజ్ఞులు గా వుండే అతి తక్కువమంది మాత్రమే క్రీయాశీలకంగా తాము పనిచేయలేం అనుకున్న వెంటనే స్వచ్ఛందంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయ్యారు తప్ప అత్యధికశాతం మాత్రం పదవే తమ పరమపదసోపానం అని తమ అదృష్టాన్ని ప్రతి ఎన్నికల్లో పరీక్షించుకుంటూనే వుంటూ వస్తున్నారు.వయోభారం కారణంతో ప్రధాని మోడీ పార్టీలో సీనియర్ నేతలు ఎల్ కె అద్వానీ, మురళి మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ వంటివారిని పక్కన పెట్టేశారు. ఆ కారణం చూపి తనను సమర్ధించే నాయకులతో టీం సెట్ చేసుకుని పాలన చేస్తున్నా సమస్యలు తప్పలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కిడ్నీ సమస్యతో ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స అనంతరం ఆమె చురుగ్గా విధుల్లో పాల్గొనలేక అవస్థలు పడుతున్నారు. మరోమంత్రి అనంతకుమార్ క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూశారు. ఇక ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ రెండేళ్ళుగా తీవ్ర అనారోగ్యంతోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కిడ్నీ సమస్యతో అమెరికా వెళ్లిన ఆయన తాజాగా క్యాన్సర్ కూడా రావడంతో మరోసారి సెలవు చీటీ ఇచ్చి యుఎస్ వెళ్లిపోయారు. ఇప్పటికే గోవా సీఎం గా వున్న మనోహర్ పారికర్ ఆరోగ్యం దారుణంగా వుంది. వైద్యులు హెచ్చరించడంతో విశ్రాంతి తీసుకుందామని ఆయన అధిష్టానం ను అభ్యర్ధించినా కమలదళం ససేమిరా అని చెప్పడంతో అలాగే బండి ఈడుస్తున్నారు. తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వైన్ ఫ్లూ బారిన పడటంతో ఎన్నికల ముందు కమల దళంలో కలవరం బయల్దేరింది.కాంగ్రెస్ పార్టీ వయోవృద్ధ నేతలతో కళకళ లాడుతూనే ఉంటుంది. సాక్షాత్తు కాంగ్రెస్ అధినేత్రిగా మొన్నటివరకు పనిచేసిన సోనియా గాంధీ అనారోగ్యంతోనే పార్టీని నడుపుకుంటూ వచ్చారు. ప్రస్తుతం రాహుల్ కి బాధ్యతలు అప్పగించినా తెరవెనుక నిర్ణయాలన్నీ ఆమెవే అన్నది జగమెరిగిన సత్యమే. హస్తం పార్టీలో వున్న కురువృద్ధుల జాబితా పరిశీలిస్తే రాజకీయాల్లోకి వద్దామని భావించే యువ నేతలు తమ ఆసక్తి పూర్తిగా చంపుకునే పరిస్థితి కనిపిస్తుంది.తమ వారసులు వెనుక సిద్ధంగా వున్నా పదవులు పట్టుకుని వేలాడే తీరే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్లోనూ నడుస్తుంది. ములాయం, లాలూ ప్రసాద్ వంటివారే దీనికి ఉదాహరణ. కరుణానిధి సైతం పూర్తి అస్వస్థతకు గురయ్యాకే స్టాలిన్ కి పగ్గాలు ఇవ్వడానికి ఆలోచన చేశారంటే నేతల పదవీ కాపీర్ణం స్పష్టం అవుతుంది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.అటల్ బిహారి వాజ్ పేయి తన వయోభారాన్ని స్వయంగా గుర్తించి 2005 తరువాత రాజకీయాలకు గుడ్ బై కొట్టారు. ఎపి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 60 ఏళ్ళకు రిటైర్ అవుతా అని సంచలన ప్రకటన చేశారు. అనుకోకుండా రెండోసారి సిఎం అయి హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయినప్పుడు అదే 60 ఏళ్ళు ఉండటం కాకతాళీయం. ఈ నిర్ణయం వైఎస్ తీసుకొవడానికి కారణం ఆయన సహచరుడు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. తాను రూపొందించిన ఫార్ములాకు కట్టుబడి 60 ఏళ్ళ వయస్సు రాగానే ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు అరుణ కుమార్. తన అనుభవాలను రాష్ట్ర ప్రయోజనాలకోసం వినియోగిస్తూ క్రీయాశీలకంగా వుంటూ ఇతర నేతలకు ఆదర్శంగా నిలిచారు ఉండవల్లి. ఇటువంటి వన్ని పరిశీలిస్తే రాజకీయాల్లో రిటైర్మెంట్ వయస్సును ఎన్నికల కమిషన్ నే రూపొందిస్తే మంచిదని సోషల్ మీడియా లో పోస్ట్ లు తరచూ నెటిజెన్స్ పెట్టడం గమనార్హం.