తెరాస నేతల ఆంధ్రా ద్వేషాన్ని ప్రచారం చేయాలని నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పశ్చిమ బంగా పర్యటన లో వున్న చంద్రబాబు శనివారం ఎలక్షన్ మిషన్ 2019పై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ కేసీఆర్, కవిత, కేటీఆర్ , హరీష్ దుర్భాషలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వారితో అంటకాగుతున్న జగన్ వైఖరిని ఎండగట్టాలని తెలిపారు. వరంగత్ లో తనపై రాళ్లేసిన వాళ్ళతో జగన్ లాలూచిపడ్డారని, కేసుల కోసమే మోదీతో జగన్ లాలూచి పడ్డారని విమర్శించారు. అలాగే అక్రమాస్తుల కోసం కేసీఆర్ తో లాలూచి పడ్డారని అన్నారు. వైసీపీ లాలూచి రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాన్ఫరెన్స్ లో నేతలను చంద్రబాబు ఆదేశించారు. డబ్బులు పెట్టే అభ్యర్థులను వైసీపీ వెదుకుతోందన్నారు. వైసీపీ అభ్యర్థులు ప్రజల్లో ఉండేవారు కాదని.. డబ్బుల్లో ఉండేవాళ్లని వ్యాఖ్యానించారు. డబ్బుల కోసమే వైసీపీ రాజకీయం, డబ్బులతోనే జగన్ రాజకీయమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా వైసీపీ చేస్తోందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తాను 29 సార్లు ఢిల్లీ వెళ్తే మొండిచేయి చూపడమే స్పెషల్ ట్రీట్ మెంటా..? అని ఆయన ప్రశ్నించారు. గాయాలపై కారం జల్లడమేనా స్పెషల్ ట్రీట్మెంటా అని నిలదీశారు. దేశంలోని ఆలయాల్లో అశాంతిని బీజేపీ సృష్టిస్తోందని విమర్శించారు. శబరిమలలో ఉద్రిక్తతలు రెచ్చగొడుతోందని, రామాలయాన్ని మళ్లీ తెరమీదకు తెస్తోందని, కర్ణాటకలో బీజేపీ దుర్మార్గ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరదీశారని సీఎం దుయ్యబట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. బీజేపీ కుట్రలను పదిమందికి చెప్పాలని నేతలకు ఆదేశించారు. ప్రతి కార్యకర్త ఒక మొబైల్ మీడియాగా మారాలని, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని అన్నారు. ఓటర్లలో అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు.