ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఛాలెంజ్ ఇది. పదేళ్ల ముందు మీరెలా ఉన్నారు.. ఇప్పుడెలా ఉన్నారు? అంటూ పాత, కొత్త ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేయడమే ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం. ఈ ఛాలెంజ్ సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు విశేష స్పందన వస్తోంది. సినీతారలు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఈ ఛాలెంజ్ స్వీకరించి #10ఇయర్ ఛాలెంజ్ హ్యాష్ ట్యాగ్‌కి తమ ఫోటోలు షేర్ చేస్తున్నారు. కొందరైతే వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఛాలెంజ్‌ను తనకు అనుకూలంగా మార్చుకుంది. ఈ ఐదేళ్లలో దేశంలో వచ్చిన మార్పులను సూచిస్తూ # ఇయర్ ఛాలెంజ్ హ్యాష్‌టాగ్ ద్వారా బీజేపీ వరుస పోస్టులు పెడుతోంది. మోదీ ప్రధాని అయ్యాక ఈ ఐదేళ్లలో దేశం ఎలా డెవలప్ అయింది, యూపీఏ, ఎన్డీయే పాలనకు ఎంత తేడా ఉందో ప్రజలకు తెలిసేలా ప్రచారం మొదలుపెట్టింది. ఈ ఛాలెంజ్ ద్వారా బీజేపీ, కాంగ్రెస్ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ సోషల్‌మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. 2014లో 56 అంగుళాలున్న మోదీ ఛాతీ.. ఐదేళ్లలో 36 అంగుళాలకు తగ్గిపోయిందంటూ కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ పోస్టులు పెడుతోంది. ఇరు పార్టీల మధ్య ఈ సోషల్‌మీడియా వార్ ఎక్కడి వరకు వెళ్తుందో వేచిచూడాలి.