ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం అయిన అరకు లోయలో అంతర్జాతీయ హాట్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. పర్యటకులను ఆకర్షించడం కోసం ఏపీ టూరిజం శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో అరకు లోయ 'హరివిల్లు'ను తలపిస్తోంది. పచ్చని వాతావరణం కొండ కోనల మధ్య రంగురంగుల బెలూన్లు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. చల్లని వాతావరణంలో గడిపేందుకు అరకు వస్తున్న పర్యాటకులకు ఈ హాట్ బెలూన్లు కనువిందు చేస్తాయి. అందమైన బుడగులతో అరకు మరింత అందంగా కనిపిస్తోంది. ఇక పర్యాటకులకైతే విశాఖ మన్యం సరికొత్త అనుభూతిని పంచుతోంది. జనవరి 20 వరకు ఈ ఫెస్టివెల్ కొనసాగనుంది.ఈ ఫెస్టివెల్‌లో దాదాపు 26 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు బెలూన్ గ్లైడర్స్ తమ బ్రాండింగ్‌ను ప్రదర్శిస్తున్నారు. ఈసారి కార్న్ ఫ్లా, జోకర్, ఎగ్, స్ట్రాబెర్రీ, నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు సాధారణ బెలూన్లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా రెండు విభాగాల్లో బెలూన్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ బెలూన్లు సముద్ర మట్టానికి 50వేల అడుగుల ఎత్తు వరకూ ఎగురుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. అనుకూలమైన వాతావరణంతోపాటు సంక్రాంతి వారాంతపు సెలవులు కలిసి రావడంతో ఈసారి హాట్ బెలూన్ ఫెస్టివల్‌కు మంచి స్పందన వచ్చింది. దాంతో పర్యాటకులతో అరకు సందడిగా మారింది. కొండలు, కోనలు, వాగులు, జలపాతాల అందాలతో పాటు అరకు లోయలో నివాసం ఉండే గిరిజన ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానాలు సైతం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.