సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరో షాక్ తగలబోతోంది. అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించబోతున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. యూజర్ల సమాచార గోప్యత నిబంధనల ఉల్లంఘన అంశంపై ఎఫ్‌టీసీ దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. త్వరలో ఫేస్‌బుక్‌పై భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది. ఎఫ్‌టీసీ ఇప్పటి దాకా గరిష్టంగా టెక్ దిగ్గజం గూగుల్‌పై 22.5 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఇది 2012లో జరిగింది. ఫేస్‌బుక్‌పై జరిమానా దీని కన్నా ఎక్కువ ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యూజర్ల వ్యక్తిగత వివరాలను వారి అనుమతి లేకుండా విక్రయించిందన్న అంశంపై ఫేస్‌బుక్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డేటా భద్రత నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. యూజర్ల డేటా లీకైందనే విషయాన్ని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా అంగీకరించారు. అమెరికన్ పార్లమెంటరీ కమిటీ ముందు హజరైన ఈయన భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూస్తామని హమీ ఇచ్చారు.