Highlights
- తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న'గుండు'
- ‘అహ నాపెళ్లంట’ చిత్రంలో సినీరంగ ప్రవేశం
- 400లకు పైగా సినిమాలు
ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన గతకొంతకాలంగా మూత్రం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
ఇటీవల గుండు హనుమంతరావు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసింది.
ఆయన సుమారు 400లకు పైగా సినిమాల్లో నటించారు. ‘అహ నాపెళ్లంట’ చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన హనుమంతరావు... మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్ హీరో, కొబ్బిరి బోండాం, బాబాయ్ హోటల్, శుభలగ్నం, క్రిమినల్, పెళ్లాం ఊరెళితే తదితర చిత్రాల్లో అద్భత నటన కనబర్చారు. ఇక బుల్లితెరపై ఆయన నటించిన ‘అమృతం’ సీరియల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంజి పాత్రలో ఆయన కనబర్చిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సీరియల్‌కు గాను ఆయన నంది అవార్డు సైతం అందుకున్నారు.