ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఈ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శనివారం తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే సోమవారం విచారణ జరిగే అవకాశం కూడా ఉంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై శనివారం హైకోర్టులో విచారణ జరగ్గా.. కోర్టులో జగన్ తరపు లాయర్ తన వాదనల్ని వినిపించారు. సెలవు దినాల్లో కుట్ర పూరితంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తున్నారని జగన్ తరపు లాయర్ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసి దొడ్డి దారిన ఆర్డర్ తెచ్చే ప్రయత్నం చేసిందన్నారు. దాడి జరిగిన చోటు కేంద్రం పరిధిలో ఉందని గతంలో చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కుట్ర భయటపడుతుందన్న భయంతో ఎన్‌ఐఏ విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో నిజాన్ని బయటకు రాకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. గతేడాది అక్టోబర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో వేచి ఉన్న జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమయ్యింది. ఈ కేసు విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసినా.. వైసీపీ దాన్ని వ్యతిరేకించింది. జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూనే ఏపీ సర్కార్ హైకోర్టులో పిటిషన్ వేసింది.