వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న సినీనటుడు ప్రకాశ్‌రాజ్ తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనన్నారు. రాజకీయ పార్టీలేవీ నిజాయితీగా వ్యవహరించడం లేదన్నారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రకాశ్ రాజ్.. మూడు నెలలకు మించి నేను ఏ పార్టీలోనూ ఉండలేను అని చెప్పారు. జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. సిగ్గులేని వ్యక్తుల సమూహం అని మండిపడ్డారు. వారికి వారు గో భక్తులం అని చెప్పుకుంటారు. కానీ గోవులను పూజించే ముఖ్యమైన పండుగ (మకర సంక్రాంతి) నాడు మాత్రం వారు సొంతింటికి దూరంగా ఢిల్లీలోని రిసార్ట్‌లో క్యాంప్‌లో బస చేస్తారు అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ, లక్నోల్లో ఏసీ రూమ్‌లలో ఉంటున్న వారు అయోధ్యలో రామ మందిరం అంశంపై రాజకీయాలు చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ విమర్శించారు. అసలు మీడియా ప్రతినిధులు అయోధ్యకు వెళ్లి అక్కడి ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని కోరారు. రామరాజ్యం కావాలని అడుగుతున్న వారు తీసుకొచ్చే రామరాజ్యం ఇదేనా? అని ప్రశ్నించారు.