మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ ప్రముఖ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేశారు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. అది మెదలు ఆమెపై సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. రేప్ చేస్తామని కొందరు బెదిరింపులకు పాల్పడుంటే, నువ్వు ఒప్పుకుని అతడితో గడిపి ఇప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదని ఉచిత సలహాలిస్తున్నారు. ఇలాంటి వేధింపులు ఎదురవుతున్నా.. తనదైన రీతిలో ఎదుర్కొంటున్న సింగర్ తాజాగా స్పందించారు. ప్రముఖ నటి ప్రియాంక చోప్రా 2009లో ఓ చిన్నారిని ఎత్తుకోగా, 2019లో పెద్దవాడైన అతడిని వివాహం చేసుకున్నట్లు మీమ్‌ను పోస్ట్ చేయడాన్ని చిన్మయి తప్పుపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. క్యాజువల్ సెక్సిజం మంచిది కాదని, ఆ ఫొటో చాలా అసహ్యంగా ఉందని.. మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అని ప్రశ్నించారు. ‘ఈ మెమె ఎలా ఉందో చూడండి. ఈ దేశంలో ఓ వ్యక్తి తనకంటే వయసులో 25ఏళ్ల తక్కువున్న మహిళల్ని వివాహం చేసుకుంటున్నారు. ప్రపంచంలో అయితే 60 ఏళ్లు వృద్ధుడు బాలికలను వివాహం చేసుకుంటున్నారు. అయితే ఓ మహిళ తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోకూడదా. ఇదేనా 10 ఏళ్ల ఛాలెంజ్’ అని సింగర్ చిన్మయి శ్రీపాద ప్రశ్నించారు.