తిరుమలలోని వివిధ ప్రముఖ తీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి జనవరి 21వ తేదీ సోమవారం జరుగనున్న నేపథ్యంలో అందుకు విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. పాపానాశనం వద్ద భక్తుల సౌకర్యార్థం టిటిడి చేస్తున్న ఏర్పాట్లను శనివారం జెఈవో వివిధ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రామకృష్ణ తీర్థ ముక్కోటికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున టిటిడి అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తునట్లు తెలిపారు. ఇందులో భాగంగా టిటిడి ఇంజినీరింగ్ విభాగంవారు తాత్కాలిక షేడ్లు, అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో పులిహోర, పెరుగన్నం ప్యాకెట్లు, మజ్జిగ, తాగునీరు బాటళ్ళు అందిస్తామన్నారు. పాపావినాశనం నుండి త్రాగునీటి కొళాయిలు, భక్తులకు అవసరమైన సమాచార బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. రామకృష్ణ తీర్థం వద్ద పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యం ఇవ్వాలని అందుకు అనుగుణంగా అదనపు సిబ్బందిని ఏర్పాటు చెయ్యాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
అటవీశాఖ మరియు టిటిడి విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చెపట్టినట్లు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఒక అంబులెన్స్ను, పారామెడికల్ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రామకృష్ణ తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులు అటవీ ప్రాంతాన్ని కాపాడాలని జెఈవో విజ్ఞప్తి చేశారు.