శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆదివారం పూర్తిగా మూసేశారు. వార్షిక మండల యాత్ర అయిపోయాక, ఆలయాన్ని మూసేస్తూ... చివరిసారిగా పూజారులు కొన్ని ప్రత్యేక పూజలు చేశారు. అప్పటివరకూ ఆలయం దగ్గర ఆందోళనలు చేస్తూ... నిరాహార దీక్షలు చేపట్టిన బీజేపీ కార్యకర్తలు... హమ్మయ్య అనుకుంటూ... నిరాహార దీక్షల్ని విరమించారు. పందళరాజ వంశస్థుడు రాఘవ వర్మ రాజా సంప్రదాయం ప్రకారం చివరిరోజున ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ వెంటనే ఆలయ గర్భగుడిని మూసేశారు. మనం రోజూ శబరిమల దగ్గర జరుగుతున్న ఆందోళనలు చూస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ... 10 ఏళ్లకు పైబడి 55 ఏళ్లకు లోబడి వయసున్న మహిళా భక్తులు వస్తే చాలు... గుడిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకొని ఆందోళనలు చేశారు బీజేపీ కార్యకర్తలు. ఫలితంగా ప్రభుత్వం దాదాపు 6,000 మందిని అరెస్టు చేసింది. ఆందోళనలు కొనసాగుతున్నా... 67రోజుల పాటు అయ్యప్ప స్వామికి పూజలు చేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. తిరిగి ఫిబ్రవరి 13న ఆలయాన్ని కొంతసేపు తెరుస్తారని తెలిసింది.మహిళా భక్తుల్ని ఆలయంలోకి ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకోగలిగామని బీజేపీ చెబుతుంటే... అంత సీన్ లేదన్న కేరళ సీఎం పినరయి విజయన్... ఈ రెండు నెలల కాలంలో... దాదాపు 50 మంది మహిళలు ఆలయంలోకి వెళ్లారని అంటున్నారు. తద్వారా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి చూపామని చెబుతున్నారు. సంప్రదాయాల్ని కాపాడుతున్నామన్న నెపంతో బీజేపీ శాంతి భద్రతలకు భంగం కలిగించింది అని ఆయన ఆరోపించారు. ఏది ఏమైతేనేం... మొత్తానికి వార్షిక మండల పూజలు సంతృప్తిగా ముగిశాయి. స్వాములంతా హ్యాపీ.