ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో తమకు 25 నుంచీ 30 శాతం ఆర్ధిక సాయం పెంచాలని రైల్వే శాఖ కోరుతోంది. ఆ ప్రకారం చూస్తే... రైల్వే శాఖ దాదాపు రూ.65,000 కోట్ల నుంచీ రూ.70,000 కోట్లు కోరుతున్నట్లు లెక్క. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రైల్వే శాఖ రూ.53,060 కోట్ల కేటాయింపులు పొందింది. ఏడో పే కమిషన్ ప్రతిపాదనలను అమలు చేసినందువల్ల, మౌలిక సదుపాయాలకు భారీగా ఖర్చు పెట్టినందువల్ల అలాగే... పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల తమ పరిస్థితి అంతంతమాత్రంగా తయారైంది రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏడో పే కమిషన్ ప్రతిపాదనలు పూర్తిగా అమలు చెయ్యాలంటే రైల్వే శాఖ దాదాపు రూ.23,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.ఇదివరకు రైల్వే ఉద్యోగులు, కార్మికులకు జీతభత్యాలు పెంచాలనుకుంటున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రతిపాదన తెచ్చింది. మేట్, కీమెన్ ఉద్యోగులకు రిస్క్ అండ్ హార్డ్ షిప్ అలోవాన్స్‌ను నెలకు రూ.2,700 నుంచీ రూ.6,000 వేలకు పెంచే ప్లాన్ ఉంది. అంతేకాదు... పెట్రోలింగ్ డ్యూటీ చేసే ట్రాక్‌మెన్ ఉద్యోగులకు రిస్క్ అండ్ హార్డ్ షిప్ అలోవాన్స్‌ను నెలకు రూ.2,700 నుంచీ రూ.4,100 వేలకు పెంచే ప్లాన్ కూడా ఉంది. స్పెషల్ 'ఏ' క్లాస్ లెవల్ క్రాసింగ్‌ల దగ్గర పనిచేసే గేట్‌మెన్‌ల భత్యాన్ని రూ.1,000 నుంచీ రూ.4,100 రూపాయలకు పెంచే ప్రతిపాదన కూడా ఉంది. సహాయకులుగా ఉండే ట్రాక్‌మెన్ భత్యాల కింద రూ.2,700 చెల్లించే ఆలోచన కూడా ఉంది.జీతభత్యాల పెంపు, ఖర్చులు పెరగడం వల్ల రైల్వే శాఖ... ఈసారి ఎక్కువ నిధులు కావాలని కోరుతోంది. ఇవన్నీ పరిశీలిస్తున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎలాంటి కేటాయింపులు జరుపుతారన్నది ఆసక్తి రేపుతున్న అంశం. ఇందులో ఎక్కడా కూడా బుల్లెట్ రైళ్ల వంటి సరికొత్త రైళ్లు, జపాన్ తరహా అత్యాధునిక రైల్వే వ్యవస్థలూ లేవు. చిన్న చిన్న సదుపాయాల కల్పనకే అదనపు నిధులు కావాలని రైల్వే శాఖ కోరుతోంది. ఎన్నికల బడ్జెట్ కావడంతో... రైల్వే శాఖలో ఈ సారికి విప్లవాత్మక మార్పులేవీ ఉండబోవని తెలుస్తోంది