కోల్ కత్తాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ర్యాలీ సూపర్ సక్సెస్ కావడంతో బీజేపీయేతర కూటమిలో కొంత ఆశలు చిగురించాయి. మొత్తం 20 మంది వరకూ వివిధ పార్టీల నేతలు ఈ ర్యాలీకి హాజరయ్యారు. కోల్ కత్తా ర్యాలీ తర్వాత ఎక్కడ జరపాలన్నది వీరి మధ్య చర్చకు వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి మోదీ నాలుగున్నరేళ్ల పాలనను ఎండగట్టాలని మాత్రం నిర్ణయించాయి. ప్రజల్లో ఐక్యత చాటడం వల్ల దేశవ్యాప్తంగా మోదీ దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చన్న వ్యూహంలో ఉంది. కోల్ కత్తా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు పాల్గొనకపోయినా వీరితో చర్చలు జరిపి తర్వాత ర్యాలీని ఎక్కడ జరపాలన్న దానిపై త్వరలోనే నిర్ణయించనున్నారు.విపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు మోదీ మరింత దూకుడు పెంచే అవకాశముందని కొందరు నేతలు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు పొత్తు పెట్టుకున్న గంటల్లోనే అఖిలేష్ యాదవ్ పై సీబీఐ కేసు విచారించడాన్ని దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. అఖిలేష్ యాదవ్ తర్వాత ర్యాలీని లక్నోలో జరపాలని కోరారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో చర్చించిన అనంతరం తాను డేట్ ఫిక్స్ చేస్తానని కూడా ఆయన అన్నట్లు తెలుస్తోంది. యూపీలో ర్యాలీతో మోదీని మానసికంగా దెబ్బకొట్టవచ్చన్నది కొందరి నేతల అభిప్రాయం.మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సయితం వచ్చే నెలలో ఫిబ్రవరిలో అమరావతిలో ధర్మపోరాట దీక్ష ముగింపు సభను పెట్టనున్నారు. ఈ సభకు రావాలని, త్వరలోనే తేదీని ప్రకటిస్తానని మమత ర్యాలీకి వచ్చిన నేతలందరీకీ చంద్రబాబు ఆహ్వానం పలికారు. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా మోదీ చేస్తున్న మోసాన్ని జాతీయ నేతల ద్వారా ఎండగట్టడం ద్వారా ఏపీలో తనకు లబ్ది చేకూరుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ సభకు రాహుల్ ను ఆహ్వానించి ఆ సభలో ప్రత్యేక హోదా హామీని కూడా ఇప్పించాలనుకుంటున్నారు. కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది కాంగ్రెస్ వాదన. మమత ర్యాలీకి హాజరైన ముఖ్యమంత్రి కుమారస్వామి తొలుత కర్ణాటకలో ర్యాలీ జరిపితే బాగుంటుందని సూచించారని తెలుస్తోంది. జాతీయ నేతలందరూ కర్ణాటకకు వచ్చి అక్కడ జరగుతున్నరాజకీయ పరిణామాలపై స్పందిస్తే కొంతకాలం ప్రభుత్వ మనుగడ ఉంటుందన్నది ఆయన భావన. ఇలా ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ తమ రాష్ట్రంలో ర్యాలీలు, సభలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కోల్ కత్తాలో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరకు రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతనే ర్యాలీల, సభల తేదీలు ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించాలన్న నిర్ణయం మాత్రం కోల్ కత్తా వేదికగా తీసుకున్నారు