YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక లెక్కలతో కాంగ్రెస్ టెన్షన్

కర్ణాటక లెక్కలతో కాంగ్రెస్ టెన్షన్
పైకీ మేకపోతు గాంభీర్యం పోతున్నా...లెక్కల్లో తేడాలున్నాయి. స్పష్టంగా తెలుస్తోంది. కొంప మునిగే అవకాశముంది. జాగ్రత్తపడకుంటే జారిపోవడం ఖాయం.’’ ఇవీ కర్ణాటక కాంగ్రెస్ నేతలు భయపడిపోతున్న తీరు. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ కాంగ్రెస్ పార్టీ షేక్ అవుతుంది. కమలం పార్టీ ఎత్తుగడలను ఎదుర్కొనలేక సతమతమవుతోంది. ఆపరేషన్ కమల్ ఏదీ లేదంటూ తమ ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ బెంగళూరుకు తిరిగి తీసుకువచ్చినా…కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్ కు తరలించిందంటే ఎన్ని అనుమానాలు న్నాయో ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఎప్పటికప్పుడు పరిణామాలపై ఆరాతీస్తున్నారు.రెండు రోజుల క్రితం జరిగిన శాసనసభ పక్ష సమావేశానికి నలుగురు సభ్యులు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు రమేష్ జార్ఖిహోళి, మహేష్ కమట హళ్లి, ఉమేష్ జాదవ్, నాగేంద్రలు ఖచ్చితంగా బీజేపీ వైపు వెళతారని సమాచారం కాంగ్రెస్ నేతల వద్ద ఉంది. వీరిలో ఒక్క ఉమేష్ జాదవ్ మాత్రమే తాను అనారోగ్య కారణాలరీత్యా శాసనసభ పక్ష సమావేశానికి హాజరుకావడం లేదని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ పంపారు. అయినా ఉమేష్ కూడా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈనలుగురితో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకి మద్దతు పలుకుతారు. దీంతో ఆరుగురు సభ్యులను సక్సెస్ ఫుల్ గా కమలం పార్టీ తమవైపునకు తిప్పుకుందన్నది తెలియడంతో కాంగ్రెస్ నేతలకు దడ పట్టుకుంది.మరో ఏడుగురు సభ్యులు చేజారితే ఇక ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయమనే చెప్పాలి. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశానికి హాజరయిన ఎమ్మెల్యేలు కొందరి వ్యవహరశైలి కూడా అనుమానంగానే కన్పిస్తోంది. వీరిలో ప్రతాప్ గౌడ్ పాటిల్, మునియప్ప, గణేష్, ఆనంద్ సింగ్, బసవరాజ్ దగ్గల్ వంటి వారు సమావేశానికి హాజరైనప్పటికీ ఏ క్షణంలోనైనా చేజారిపోతారన్న సమాచారం కాంగ్రెస్ అగ్రనేతలకు చేరడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్స్ కు తరలించారు. వీరందరిని రెండు మూడు రోజుల పాటు రిసార్ట్స్ లోనే ఉంచి వారి సమస్యలను సావధానంగా వినాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. తేడా వస్తే గవర్నర్ వెంటనే బలనిరూపణకు ఆదేశించే అవకాశం ఉండటంతో ముందుజాగ్రత్తలు తీసుకున్నారంటున్నారు.మరోవైపు బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప తుపాను ముందు ప్రశాంతతలా తాము ఆపరేషన్ కమల్ చేపట్టలేదని, తమ వద్దకు వచ్చేవారిని కాదనబోమని చెబుతున్నారు. ఆయన ఖచ్చితంగా కమలం పార్టీలోకి అసంతృప్త ఎమ్మెల్యేలు రెండు, మూడు రోజుల్లోనే వస్తారన్న అంచనాలోఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ తమతో పది నుంచి పదిహేను మంది కాంగ్రెస్ శాసనసభ్యలు టచ్ లో ఉన్నారని యడ్యూరప్ప తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. త్వరలోనే మంచిరోజులు వస్తాయని అంటుండం కూడా ఈ అనుమానాలకు తావిస్తోంది. మొత్తం మీద గంప కింద కోడిపెట్టల్లా ఎన్నాళ్లు కాంగ్రెస్ తమ శాసనసభ్యులను దాచిపెట్టుకోవాలో అన్నది చూడాల్సి ఉంది.

Related Posts