YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేంద్ర మంత్రుల బెదిరింపులకు భయపడం

కేంద్ర మంత్రుల బెదిరింపులకు భయపడం
ఏం మేలు చేశారని కేంద్ర మంత్రులు వారానికొకరు రాష్ట్రానికి వస్తున్నారని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.  రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరింపులు చేస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేవారెవరూ లేరన్నారు.  సోమవారం నాడు అయన తెదేపా నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో  మాట్లాడారు.  కోల్కతాలో నిర్వహించిన విపక్షాల సభకు 10లక్షల మందికి పైగా తరలివచ్చారని.. అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభను దీనికి దీటుగా నిర్వహించాలని నేతలకు సూచించారు.  ప్రధాని మోదీ పాలనలో సంక్షేమం పడకేసిందని, భాజపా పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ నిధులు ఏపీకి కేటాయించారని చంద్రబాబు ఆరోపించారు.  గతంలో వైఎస్ను తెలంగాణ సీఎం కేసీఆర్ నిందించారని.. ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై కేసీఆర్దే రెండో సంతకమని దుయ్యబట్టారు.  ఇప్పుడు అదే కేసీఆర్ వైఎస్ను పొగుడుతున్నారని విమర్శించారు. బీసీల్లో అపోహలు తేవాలని వైకాపా, తెరాస కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు.  మోదీ డైరెక్షన్లోనే ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు.  బీసీలను తెదేపాకు దూరం చేయాలనే కుతంత్రాలు చేస్తున్నారని.. ఆ మూడు పార్టీల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.  బీసీలే సంఘటితంగా కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు.  చిత్తూరుకు కృష్ణా జలాలు రావడం ఒక చరిత్ర అని.. కృష్ణా జలాలకు రాయలసీమ ప్రజలు హారతులు పడుతున్నారని చెప్పారు.  నాలుగు సీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వగలిగామని, అసాధ్యాలను సుసాధ్యం చేశామన్నారు.  ప్రతిపక్షం పూర్తిగా డీలాపడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Related Posts