ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ అందించిన సాయం మరెవరూ అందించలేదని, దీనిపై టీడీపీ నేతలకు ఛాలెంజ్ విసురుతున్నానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. సోమవరం నాడు విజయవాడలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. భేటీలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేస్తుందని చెప్పారు. మేధావులు కేంద్రం అందించిన నిధుల నివేదికలను పరిశీలించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించినందుకు గడ్కరీని రాష్ట్ర బీజేపీ నేతలు సన్మానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన పథకాలతోనే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకొని బీజేపీనే విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో టీడీపీ విడిపోయిన తరువాతే రాష్ట్రానికి 24 వేల కోట్ల నిధులు ఇచ్చామన్నారు. చంద్రబాబుకు ధన దాహం, భూదాహం పట్టుకుంది. మోదీ అంటే భయంతో ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబుకు అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక దోపిడీ పెరిగిపోయింది. ఇసుక దోపిడీ ద్వారా రూ.2 వేల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. 16,200 కోట్లతో రోడ్ల పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు. ఇప్పటికీ ఇసుక దోపిడీని సీఎం చంద్రబాబు అరికట్టలేక పోయారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారని తెలిపారు. భూములు ఆక్రమమించిన పచ్చ పాములు పేర్లు బైటకు వస్తాయని సిట్ నివేదికను తొక్కిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్ పార్టీతోనే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్నారు. ఎన్నికల సర్వేలు చూస్తుంటే చంద్రబాబుకు భయమేస్తోందన్నారు. మొన్నటి వరకు బీజేపీ, వైఎస్ జగన్, పవన్ ఒక్కటే అని విమర్శలు చేసిన టీడీపీ నాయకులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు తొలగించి టీఆర్ఎస్ పేరు చేర్చారన్నారు.