జర్నలిస్ట్ లకు ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలన్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ (ఏపీజేఎఫ్) డిమాండ్ పై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆహ్వానం మేరకు ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణఅంజనేయులు నాయకత్వంలో పాత్రికేయ బృందం సోమవారం సచివాలయంలో చర్చలు జరిపింది. ఇరువర్గాల మధ్య చర్చలు సఫలీకృతం అయ్యాయి. రాష్ట్రంలోని పాత్రికేయులందరి కి గృహాలు నిర్మించి ఇవ్వాలన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి వున్నదని మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు. గత నాలుగురోజులుగా చేస్తున్న ఆందోళన విరమించాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. గృహానిర్మాణాలపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని ఏపీజేఎఫ్ అధ్యక్షులు కృష్ణఅంజనేయులు పట్టుబట్టారు. దీనిపై మంత్రి కాలువ స్పందిస్తూ ఈ నెల 25 వ తేదీన అనంతపురం జిల్లాలో జరిగే సమావేశానంతరం స్పష్టమైన తేదీ ప్రకటిస్తామని చెప్పారు. గృహనిర్మాణ పధకం క్రింద అర్హులైన వారందరికీ ఫిబ్రవరి 5 వ తేదీ లోగాసబ్సిడీ విడుదల చేయనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. అదే విధంగా స్వంత స్థలం కలిగివుండి, గృహాలు నిర్మించుకునాలనుకునే వారికి ఫిబ్రవరి 15 వ తేదీ లోగా అన్ని అనుమతులు మంజూరు చేయనున్నట్టు మంత్రి చెప్పారు. డిసెంబర్ 31 వ తేదీ నాటికి గృహ నిర్మాణాలు కు శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని కృష్ణఅంజనేయులు ప్రశ్నించారు. జర్నలిస్టులు ఆందోళన ప్రారంభించే వరకు ప్రభుత్వ విభాగాలకు సంభందించిన ఏ అధికారి కనీస సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని కృష్ణఅంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై మంత్రి స్పందిస్తూ గృహానిర్మాణాలకు సంభందించి ఇప్పటివరకు దాదాపు 9 వేల 85 దరఖాస్తులు అందాయని, వాటిలో అర్హులైన వారందరికీ గృహాలు నిర్మించే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. రాజధాని అమరావతి పరిధిలో షుమారు 18 వందల మంది జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు, గృహాలు నిర్మించి ఇవ్వనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. కొంతమంది దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయినట్టు మంత్రి వివరించారు. జర్నలిస్టుల గృహ నిర్మాణాలు కు సంబంధించి నిబంధనలు సరళతరం చేయాలని కృష్ణఅంజనేయులు కోరారు. రేషన్ కార్డులు లేవనే సాకుతో దరఖాస్తులు తిరస్కరించటం సమంజసం కాదని కృష్ణఅంజనేయులు కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని మంత్రి హామీ ఇచ్చారు.