నిషేధిత వయసున్న మహిళలు శబరిమల అయ్యప్ప సన్నిధానంలోకి ప్రవేశించడంతో ప్రధాన పూజారి ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ నిర్వహించిన విషయం తెలిసిందే. తంత్రీ చర్యలు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయంటూ ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్డ్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ టీడీబీ నోటీసులు జారీచేసినా ఆయన ఇంత వరకూ స్పందించలేదు. దీంతో సోమవారం మరోసారి గడుపు పొడిగించిన ట్రావెన్‌కోర్ దేవస్థానమ్ బోర్డు, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆదివారం వరకూ ఆలయం తెరిచే ఉండటంతో తంత్రికి సమయం చిక్కలేదని, ప్రస్తుతం సన్నిధానం మూసివేయడంతో ఆయనకు తీరిక దొరికింది కాబట్టి, ఇతరుల అభిప్రాయాన్ని తీసుకుని వివరణ ఇస్తాడని అశిస్తున్నామని, అందుకు మరో 15 రోజులు గడువు విధించినట్టు టీడీబీ ఛైర్మన్ పద్మకుమార్ తెలిపారు. సాధారణంగా సంప్రోక్షణ నిర్వహిస్తారు కానీ, జనవరి 2న 50 ఏళ్లలోపు మహిళలు ప్రవేశించడంతో టీడీబీ అనుమతి లేకుండా శుద్ధి కార్యక్రమం చేపట్టడం సమంజసం కాదని తెలిపారు. ఈ విషయంలో టీడీబీ అనుమతి ఎందుకు తీసుకోలేదనే అంశంపై తంత్రీ రాజీవరును వివరణ కోరామని పద్మకుమార్ పేర్కొన్నారు. మహిళల ప్రవేశం తర్వాత సంప్రోక్షణ నిర్వహించడాన్నితప్పుబట్టిన కేరళ సీఎం పినరయ్ విజయన్, ఈ అంశంలో తంత్రీపై చర్యలు తీసుకోవాలని టీడీబీకి సూచించారు. ఇదిలా ఉండగా, రెండు నెలల పాటు మండల, మకర విళక్కు పూజలు నిర్వహించిన శబరిమల ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. పడిపూజ అనంతరం మూసివేసిన ఆలయాన్ని తిరిగి ఫిబ్రవరి 13న నెల పూజ కోసం తెరవనున్నారు. మరోవైపు, శబరిమలలో నిషేధాజ్ఞలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కేరళ సచివాలయం ఎదుట 49 రోజుల రిలే నిరాహార దీక్షను బీజేపీ ప్రారంభించింది. శబరిమల ఆలయం మూసివేసినా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం విజయన్ తన పంతాన్ని నెగ్గించుకోడానికి శతాబ్దాలుగా సాగుతోన్న సంప్రదాయానికి విఘాతం కలిగించే ప్రయత్నం చేశారని కేరళ బీజేపీ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై మండిపడ్డారు