ఎన్నికలు దగ్గరపడుతున్నా.. పార్టీలో నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలను పక్కన పెట్టి.. పార్టీ నిర్ణయాల మేరకు పని చేస్తే మంచిదన్నారు. సీనియర్లమనే ఇగో ఉందా.. పదవులు ఉన్నాయనే అహం పనికిరాదు.. అంటూ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. కొంతమంది నేతల్లో లెక్కలేని తనం పెరిగిపోయిందని క్లాస్ పీకారు. సోమవారం టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో నేతలతో మాట్లాడిన బాబు.. ఎన్నికల కసరత్తుపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో చాలా మంది నేతలతో ముఖా ముఖి మాట్లాడినా మార్పు రావడం లేదని బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతలు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో అర్దం కావడం లేదన్నారు. పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించే నియోజకవర్గాల్లోనే పార్టీ పరిస్థితి బాగుందన్నారు. ప్రజల్లో మంచి మూడ్ ఉన్నా.. కొందరు నేత మూడ్ అస్సలు సరిగా లేదని మండిపడ్డారు. బూత్ కమిటీ కన్వీనర్లు ఎంత పని చేస్తే... అంత ఫలితం ఉంటుందని చెప్పారు. టీడీపీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూడాలని.. ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని ఆహ్వానించాలన్నారట. అలాగే ప్రభుత్వ పథకాలతో ఉన్న స్టిక్కర్లను ప్రతి ఇంటికీ అంటించాలని ఆదేశించారు. సమన్వయ కమిటీ భేటీలో వైఎస్ జగన్ సోదరి షర్మిల ఎపిసోడ్ కూడా చర్చకు వచ్చింది. టీడీపీకి సంబంధం లేని విషయాన్ని వైసీపీ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు అన్నారు. పింఛన్లు రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే షర్మిల వివాదాన్ని తెరపైకి తెచ్చారని వ్యాఖ్యానించారు. టీడీపీలో ఆడవాళ్లను గౌరవించే సంస్కృతి ఉందని.. వారిని కించపరిచే విధంగా పార్టీ ఏనాడూ వ్యవహరించదన్నారు. పాత వివాదంపై షర్మిలతో ఇప్పుడు ఫిర్యాదు చేయించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంపై ముగ్గురు మోదీలు రాజకీయ కుట్ర చేస్తున్నారని.. దీన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరిగిన కేసీఆర్.. మమతా బెనర్జీ పిలిస్తే కోల్‌కతా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఆడేవన్నీ నాటకాలేనని మండిపడ్డారు. ఇప్పుడు జగన్‌తో కలిసి మరో కొత్తనాటకం మొదలు పెట్టారని ధ్వజమెత్తారు.
ఎన్నికలకు సిద్ధమవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం చేసిన పనుల్ని ప్రజలకు వివరించాలన్నారు. పింఛన్ రూ.2వేలకు పెంపుపై ప్రజల్లో సంతృప్తి ఉందని.. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో పింఛన్ల పండుగ నిర్వహిస్తామన్నారు. రాజమండ్రిలో బీసీ జయహో సదస్సు ఏర్పాటు చేస్తామని.. ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ నెల 30నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని.. నాలుగున్నరేళ్లలో ఏం చేశామో చెబుతామన్నారు.