మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన సెక్యూర్టీ గార్డుపైనే చేయి చేసుకున్నారు. రోడ్ షో జరుగుతున్న సమయంలో ఆయన తన స్వంత సెక్యూర్టీ గార్డునే బాదేశారు. ఈ ఘటన దార్ జిల్లాలోని సర్దార్‌నగర్ టౌన్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు వైరల్‌గా మారింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అధికార దాహాంతో సీఎం తన సెక్యూర్టీపైనే దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ ఉద్యోగిని కొట్టిన విషయంలో సీఎంను అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై ముఖ్యమంత్రి కార్యాలయం ఇంత వరకు స్పందించలేదు. సెక్యూర్టీ గార్డును కొట్టినందుకు, అతని విధులను అడ్డుకున్నందుకు చౌహాన్‌ను ఐపీసీ 353 కింద బుక్ చేయాలని ప్రతిపక్ష నేత అజయ్ సింగ్ డిమాండ్ ఛేశారు. అందరి ముందు సెక్యూర్టీ గార్డ్‌ను అవమానించారని ఆయన విమర్శించారు. ఈ ఘటన పట్ల బీజేపీ నేత హితేశ్ బాజ్‌పాయ్ స్పందించారు. సెక్యూర్టీ గార్డ్‌పై సీఎం చేయి చేసుకున్న ఘటనను తప్పుగా చిత్రీకరించారన్నారు. ప్రచార సమయంలో సీఎం చుట్టూ భారీ సంఖ్యలో జనం ఉన్నారని, అయితే గాయమైన సీఎం పాదంపై రెండు సార్లు ఆ సెక్యూర్టీ గార్డు కాళ్లు వేశాడని, తన పాదాన్ని మళ్లీ తాకకుండే ఉండేందుకు ముందు జాగ్రత్తగా సీఎం అలా చేశారని బీజేపీ నేత స్పందించారు.