ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి కేసు ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరగ్గా.. వాదనలు ముగిశాయి. దీనిపై కౌంటర్ ఫైల్ చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలన్నింటిని కోర్టు ముందు ఉంచాలని ఎన్‌ఐఏను ఆదేశించింది. అలాగే విచారణపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు.. కేసు విచారణను 30వతేదీకి వాయిదా వేసింది. గతేడాది అక్టోబర్‌లో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో వేచి ఉన్న జగన్‌పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమయ్యింది. ఈ కేసు విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసినా.. వైసీపీ దాన్ని వ్యతిరేకించింది. జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూనే ఏపీ సర్కార్ హైకోర్టులో పిటిషన్ వేసింది.