రాజకీయ నాయకులు పదవుల కోసం యాగాలు, హోమాలు నిర్వహించడం ప్రస్తుతం పరిపాటిగా మారింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్క అడుగు ముందుంటారు. ఈ సంప్రదాయాన్ని పక్క రాష్ట్రాల్లోని నేతలూ అనుసరిస్తున్నారు. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి కోసం సచివాలయంలోనే యాగం నిర్వహించినట్టు ప్రతిపక్ష నేత స్టాలిన్ ఆరోపణలతో కలకలం రేగింది. అయితే, ఈ ఆరోపణనలను అన్నాడీఎంకే నేతలు ఖండించడం గమనార్హం. పుదుకోట్టై జిల్లా విరాలిమలైలో జల్లికట్టు పోటీలు గిన్నిస్ రికార్డు ప్రదర్శనగా ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రి దిండుకల్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 3.30 గంటలకు సచివాలయంలో డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం యాగం చేయించి, ఉదయం 5.30 గంటలకు ఆయన ఇందులో పాల్గొన్నట్టు ప్రచారం సాగింది. డీఎంకే ఎమ్మెల్యే అరవింద్ రమేశ్ కుమార్తె పెళ్లికి హాజరైన స్టాలిన్ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అవినీతి కేసులో జయలలిత జైలుకెళ్లినట్టు, కొడనాడు కేసులో ఎడప్పాడి పళనిస్వామి జైలుకెళ్తారని, అప్పుడు ఖాళీ అయ్యే సీఎం కుర్చీని అధిరోహించడానికి ఈ యాగం చేసినట్టు చెబుతున్నారంటూ స్టాలిన్ విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి ఆశించి యాగం చేశారా? లేక అక్కడి దస్త్రాలను మాయం చేసేందుకా? అనే ప్రశ్నలకు పన్నీర్‌సెల్వం సమాధానం చెప్పాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. సచివాలయం ఉన్న సెయింట్ జార్జికోట సర్వమతాలకు సమానమని... అక్కడ యాగం నిర్వహించే అధికారం వీరికి ఎవరిచ్చారని నిలదీశారు. అక్కడ యాగం నిర్వహించడానికి అదేమైనా పన్నీర్‌సెల్వం ఆస్తినా? అంటూ విరుచుకుపడ్డారు. సీఎం పదవి ఖాళీ అవుతుందని చెబుతున్నందుకు పళనిస్వామి తనపై కేసు పెట్టే అవకాశముందని, ధైర్యముంటే ఆ పని చేయాలని స్టాలిన్ సవాల్ విసిరారు. స్టాలిన్ చేస్తోన్న ఆరోపణలను మంత్రి జయకుమార్ ఖండించారు. సచివాలయంలో పన్నీర్‌సెల్వం యాగం నిర్వహించారనడానికి ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఇవన్నీ వదంతులేనని, ఆయన యాగం నిర్వహించడాన్ని ఎవరు చూశారని ప్రశ్నించారు. అన్నాడీఎంకేలో చీలికలు తీసుకొచ్చేందుకు స్టాలిన్, దినకరన్‌లు చేసిన కుట్రలో భాగమని ఆయన ఎదురుదాడి చేశారు. ఉదయాన్నే నిద్ర నుంచి మేల్కోగానే ఆ రోజుకు ఏం కుట్ర చేయాలా? అని వీరు ఆలోచిస్తున్నారంటూ విమర్శించారు.