కోల్‌కతా సభకు ఆహ్వానం ఉన్నా సీఎం కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఫ్రంట్ ఏర్పాటు చేసి ఓట్లు చీల్చాలనే ఆలోచనే తప్ప... ప్రజల విషయంలో కేసీఆర్‌కు కమిట్మెంట్ లేదని దుయ్యబట్టారు. ఆర్థికబలహీనవర్గాలకు10 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలో ఏ విధంగా వెళ్లాలనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఇందులో పొందుపరచాలని ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్రం సహకారం లేకపోవడంతో పోలవరం నిర్మాణానికి నిధుల సమస్య వస్తోందని, నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి సీఎం చంద్రబాంబు లేఖ రాశారు గుర్తుచేశారు. డ్వాక్రా మహిళలకు మరో రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, రైతు రుణమాఫీ మొత్తాలను చెల్లిస్తున్నామని కళా పేర్కొన్నారు. రైతుకు పెట్టుబడి సాయం కింద లబ్ది చేకూర్చాలని ఆలోచనతో ప్రభుత్వం ఉందని కళా వెంకట్రావు తెలిపారు.