యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కన్ఫ్యూజన్ ఎదుర్కొంటోంది. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థి ఎవరన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. జగన్ పాదయాత్ర సమయంలోనూ ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. 2014 నుంచి ఇప్పటి వరకూ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయ కర్తలు మారారు. ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు. ప్రస్తుతమున్న ఇన్ ఛార్జికి కూడా టిక్కెట్ దక్కుతుందన్న గ్యారంటీ లేదు. దీంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది.ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెడ్డి విజయశాంతిని శ్రీకాకుళం పార్లమెంటు ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించారు. రెడ్డి శాంతి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఆమెను ఇన్ ఛార్జి పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత తమ్మినేని సీతారాం ను పార్లమెంటు ఇన్ ఛార్జిగా నియమించారు. ఆయనను కూడా పక్కన పెట్టి దువ్వాడ శ్రీనివాస్ ను ఇన్ ఛార్జిగా నియమించారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి ప్రాంతానికి చెందిన వ్యక్తి. సామాజిక పరంగా దువ్వాడ నియామకం రైట్ ఛాయిస్ అయినప్పటికీ ఆర్థికంగా ఆయన బలహీనంగా ఉండటమే మైనస్ పాయింట్.శ్రీకాకుళం ఎంపీ స్థానానికి తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు బరిలోకి దిగనున్నారు. రామ్మోహన్ నాయుడిని ఎదుర్కొనే బలమైన అభ్యర్థి కోసం వైసీపీ అధిష్టానం అన్వేషిస్తుందని సమాచారం. కళింగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండి ఆర్థికంగా బలంగా ఉన్న వారిని బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. తొలుత శ్రీకాకుళం ఎంపీ స్థానానికి తమ్మినేని సీతారాం ను బరిలోకి దించాలనుకున్నా ఆయన విముఖతచూపారు. తర్వాత మాజీ మంత్రి ధర్మాన వైపు జగన్ చూపు మళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.రామ్మోహన్ నాయుడిని సమర్థవంతంగా ఎదుర్కొనగలిగే శక్తి ధర్మాన ఒక్కరికే ఉందని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయన పోటీ చేయనని చెబుతున్నప్పటికీ నచ్చ జెప్పి ఎంపీస్థానానికి బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పాతపట్నం, ఆముదాల వలస, శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఈ నేపథ్యంలో సామజిక వర్గం బలం ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కే జగన్ కేటాయిస్తారా? లేక ధర్మాన ప్రసాదరావును డిసైడ్ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలలే సమయం ఉండటంతో త్వరగా నిర్ణయం తీసుకుని పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించాలని ఇక్కడ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.